- కమలా హారిస్ పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
వాషింగ్టన్: త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో రాజకీయపక్షాల మధ్య మాటలయుద్ధం శృతిమించుతోంది. డెమోక్రాట్లు అంటేనే ఒంటికాలిపై లేచే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా యూఎస్‌లో ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఇండో-అమెరికన్ కమలా హారిస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలైతే అది అమెరికాకు తీవ్ర అవమానకరమని వ్యాఖ్యానించారు. యూఎస్‌లో ప్రజలెవరూ కమలా హారిస్‌ను ఇష్టపడడం లేదన్నారు. నార్త్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ప్రజలు ఆమెను ఇష్టపడరు. ఆమె ఎప్పటికీ యూఎస్ అధ్యక్షురాలుగా ఉండలేరు. ఇది మన దేశానికి అవమానకరం’ అని అన్నారు. డెమోక్రాట్ల తరఫున ఆమె ముందు అధ్యక్ష రేసులో ఉన్నప్పటికీ తర్వాత వైదొలిగారని, అయినా కూడా బిడెన్ (ట్రంప్ ప్రత్యర్థి) ఆమెను సహాయకురాలిగా ఎందుకు నియమించాడో తనకు అర్థం కావడం లేదన్నారు. బిడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లేనని, అదే జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని ట్రంప్ ఆరోపించారు. చైనా ప్లేగు (కరోనా) కారణంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ఆయన విమర్శించారు. చైనాతో పాటు దేశంలో నిరసనలు, అల్లర్లకు పాల్పడుతున్న వారంతా బిడెన్‌కు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం చేసుకోవాలని హితవుపలికారు. కాగా, నవంబర్ 3న అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.