Breaking News

ఆదాయపు పన్ను ఎగవేత

ఆదాయపన్ను ఎగవేత
  • భారీగా బకాయిలు పడ్డ ట్రంప్
  • అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సరం మాత్రమే చెల్లింపు

న్యూయార్క్ : అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నేళ్ళుగా ఆయన ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. గడిచిన పదిహేనేళ్లలో.. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన 2016-17 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించారని, అంతకుముందు దాదాపు పదేళ్లకు పైగా బకాయిలు ఉన్నాయని ఆ కథనం సారాంశం. మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో ఈ అంశం రాజకీయంగా ట్రంప్ కు ఇబ్బందులు తీసుకురానుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన 2016లో $750 డాలర్లు ఆదాయపు పన్ను రూపంలో చెల్లించారు. అంతకుముందు గానీ ఆ తర్వాత గానీ ఆయన ఇన్ కమ్ టాక్స్ చెల్లించలేదు. కొద్దికాలంగా ఆయన వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని, అందుకే ఆదాయపు పన్ను చెల్లించడం లేదని ఆరోపించింది.

2018లో తనకు 47.4 మిలియన్ డాలర్ల నష్టాలు వచ్చాయని ప్రభుత్వానికి చూపించగా.. మీడియాకు విడుదల చేసిన వార్షిక నివేదికలో తనకు 434 మిలియన్ డాలర్ల ఆదాయం ఉందని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తన ఆదాయ పన్ను వివరాలు గురించి ట్రంప్ బయటకు వెల్లడించడం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆదాయపు పన్ను ఎగ్గొడుతున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. కాగా తాజా ఆరోపణలపై ట్రంప్ స్పందిస్తూ.. అవి ‘నకిలీ వార్తల’ని కొట్టిపారేశారు. గత దశాబ్ద కాలంగా ఆయన లక్షలాది రూపాయలను ఆదాయపు పన్ను రూపంలో చెల్లించారని ట్రంప్ తరఫు లాయర్ వైట్ హౌస్ లో మీడియాకు తెలిపారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే అధ్యక్ష రేసులో వెనుకబడ్డ ట్రంప్ కు తాజా వివాదం మరింత నష్టం చేకూర్చుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.