- ధ్వంసమైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమ కట్టడాలు
- జనాగ్రహానికి ధ్వంసమైన యాదగిరిరెడ్డి కబ్జా భూమి
- పోలీసుల రంగ ప్రవేశం, అఖిలపక్షనాయకుల అరెస్టు
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ రాజకీయం కలకలం రేపుతోంది. అక్రమ నిర్మాణం చేపట్టారని విపక్ష నాయకులు, కార్యకర్తలు వాటిని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇక్కడి పెద్దచెరువు కింద భాగంలో కొంత ప్రదేశాన్ని దశాబ్దాలుగా పట్టణ ప్రజలు పశువుల సంతగా వాడుకుంటున్నారు. భూమిని ఎమ్మెల్యే తన కుటుంబసభ్యుల చేత కొనుగోలుచేయడం మొదలుకుని బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టడం, స్థలం మునగకుండా కాంక్రీట్ తో కాల్వ నిర్మించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చేర్యాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న పట్టణవాసులు శుక్రవారం చేర్యాల బంద్ కు పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది.
బఫర్ జోన్ లో నిర్మాణం
చేర్యాల పట్టణంలో పెద్దచెరువు కింద సర్వేనం.1,402లో 21 గుంటల భూమిని కొంతమంది బినామీలను పేరిట కొనుగోలు చేశారు. వారు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సంబంధిత స్థలంలో దశాబ్దాలుగా పశువుల సంత కొనసాగుతుండడంతో పాటు ఇతర ప్రజా అవసరాలకు వినియోగిస్తున్నందున కబ్జా కాకుండా స్థానికులంతా సమావేశమయ్యారు. చెరువు బఫర్ జోన్ లో ఉన్న భూమిని అక్రమమార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టనీయొద్దని గతంలో స్థానికులు తీర్మానం చేశారు. ఈ వివాదం నడుస్తుండగానే స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన కూతురు తుల్జా భవానిరెడ్డితో పాటు మరో కొంతమంది బినామీల పేరిట 21గుంటల భూమిని కొనుగోలు చేసి, 2020 జనవరి 31న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కన్నా ముందే, ఎలాంటి టైటిల్ లేకుండానే 2018లో సర్వేనం.1,402లో తుల్జా భవానిరెడ్డి పేరిట అప్పటి చేర్యాల గ్రామపంచాయతీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోగా ఆ తర్వాత చేర్యాల పట్టణం 2018 ఆగస్టు 2న మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీగా ఏర్పడకముందే ఆగమేఘాల మీదా పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారనే ఆరోపణలు పట్టణవాసుల్లో వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ అనుమతితో చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. నాటి పర్మిషన్లకు నిరాకరించిన కోర్టు 2019 మున్సిపల్ యాక్టు తెలిపిన విధంగా మాత్రమే ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టవచ్చని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ప్లాన్ ప్రకారమే కాల్వ నిర్మాణం
చేర్యాల పట్టణానికి తలమానికమైన పెద్దచెరువు దాదాపు 215 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వర్షాలు వస్తే అదనంగా 70 నుంచి 100 ఎకరాల రైతుల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయి. చెరువు కింది భాగంలోనే చేర్యాల పట్టణంలో సుమారు 35వేల జనాభా ఉంది. వర్షాకాలంలో చెరువు నిండితే మిగులు జలాలు 221 ఫీట్ల వెడల్పుతో ఉన్న మత్తడి సమీపానికి 250 నుంచి 350 ఫీట్ల దూరంలో ఆర్అండ్ బీ రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు ఆనుకుని ఉన్న నాలాల ద్వారా మిగులు జలాల నీరంతా కుడి చెరువులోకి వెళ్తోంది. మత్తడి నుంచి ఆర్అండ్ బీ ప్రధాన రహదారి వరకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ అధికారులు మత్తడి నీటి ప్రవాహం స్థలం(బఫర్ జోన్)గా గతంలోనే ప్రకటించినట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. 2012లో జీవోనం.168 ప్రకారం 25 ఎకరాల ప్రభుత్వ శిఖం భూమి కంటే ఎక్కువ ఉన్నచో కట్ట కింద వంద ఫీట్ల వరకు ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు, భూ లావాదేవీలు జరుపకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కి ఏడాదికొక్కసారి కురిసే వర్షాలకు మత్తడి అలుగు పారినప్పుడల్లా వచ్చే వరదనీరుతో ఆ స్థలం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని పక్కాప్లాన్ తో కాంట్రాక్టర్ ‘యూ’ ఆకారంలో కాంక్రీట్ పనులు చేస్తున్నారని చేర్యాల పట్టణవాసులు, పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ నుంచి తీసుకున్న అనుమతులు చూపుతూ నిర్మాణాలు మొదలుపెట్టారు. దీంతో స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నేతల అంతా ఒక్కటై ‘చేర్యాల పరిరక్షణ సమితి’ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రూ.10కోట్ల విలువైన భూమిని ఆక్రమించడమే కాకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఇటీవల పలుమార్లు ఆందోళనకు దిగారు.
రిజిస్టేషన్ కు ముందే పంచాయతీ పర్మిషన్
సర్వే నం.1,402లోని 21 గుంటల భూమి తుల్జా భవానిరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ కాకముందే 2018లోనే నిర్మాణానికి అప్పటి ఈవో పర్మిషన్ ఇచ్చారు. ఈ అంశం ఇప్పుడు వివాదస్పదంగా మారడంతో అప్పటి ఫైలును మాయం చేశారని చేర్యాల పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తే ఎమ్మెల్యే కోసం నిబంధనలను ఉల్లంఘించిన ఆఫీసర్లంతా ఊచలు లెక్కపెట్టక తప్పదని సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీ, ఎఐఎఫ్బీ, ఎమ్మార్పీఎస్ నాయకులు, స్థానికులు అంటున్నారు
ఎమ్మెల్యేనే భూ కబ్జాలకు పాల్పడుతడా?
చట్టసభల్లో ప్రజల పక్షానా మాట్లాడాల్సిన ఎమ్మెల్యే చెరువు మత్తడిపైనే కన్నేశాడు. అధికారుల ప్రలోభాలకు లొంగి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అధికారులు వంత పాడుతుండ్రు. ప్రభుత్వ ఆస్తులను అక్రమించేందుకు ప్రయత్నిస్తే ప్రజాగ్రహానికి గురికాకతప్పదు. ప్రభుత్వాలు మరుతుంటాయి.. కానీ ప్రజలకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తాది.
:: గిరి కొండల్ రెడ్డి, మద్దూర్ జడ్పీటీసీ సభ్యుడు
పశువుల సంత చాటున అక్రమ కట్టడం
మానవత్వంతో ఎమ్మెల్యే కబ్జాచేసిన భూమిని చేర్యాల ప్రజలకు అప్పగించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాభివృద్ది గాలికొదిలేసి అవినీతి అక్రమాల పాల్పడుతోంది. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న పాలకులకు రాబోయే రోజుల్లో పుట్టగతులుండవ్. ప్రభుత్వ భూములు కుటుంబసభ్యులు, బినామీల పేరుతో అక్రమంగా కబ్జాలు చేస్తుండ్రు.
:: ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి