Breaking News

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

  • ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదు
  • తెలంగాణ సమాజం పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తోంది
  • అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు

సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరిగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. నదీజలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదని, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోబోమని ప్రకటించారు. మంగళవారం ప్రగతి భవన్ లో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొని తెలంగాణ వైఖరిని స్పష్టం చేశారు.

–ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని స్పష్టం చేశారు. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్ ను ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుందని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డిపాడును మరింత విస్తరించడాన్ని ఖండిస్తున్నామని స్పష్టంచేశారు.

– బేసిన్ అవతలికి కృష్ణాజలాలను తరలించే వీలు ఆంధ్రప్రదేశ్ కు లేదని, ఇదే విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖతో పాటు కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్ కు స్పష్టం చేయడాన్ని సరైనచర్యగా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాదనతో కేంద్రమంత్రి కూడా ఏకీభవించారు.

– తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందని, తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడి గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

– డీపీఆర్ లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరడంపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేననీ, ఇందులో రహస్యం ఏమీ లేదని, కాకపోతే నిర్మాణ క్రమానికి అనుగుణమైన స్వల్ప మార్పులు చోటుచేసుకోవడం వల్ల డీపీఆర్ లు సమర్పించడంలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తుందన్నారు.గోదావరి నదిపై (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం, నాటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవహిస్తున్న మొత్తం నీటిని వినియోగించుకోవచ్చని ఉందని, ఒకవేళ ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే 1956 చట్టం కింద ట్రిబ్యునల్ కు నివేదించుకోవచ్చన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి రెండు రాష్ట్రాలు కలిసి లేఖ ఇస్తే.. గోదావరి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తామన్నారు

– తమ అభ్యంతరాలతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర జల్ శక్తి మంత్రి ఈ ఏడాది ఆగస్టు 20న లేఖ రాసిన సంగతిని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. కేంద్రం ఇంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచి, పనులు కొనసాగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

–ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే.. తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం మహారాష్ట నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగా.. కృష్ణానదిపై అలంపూర్ – పెద్దమరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామన్నారు.

– నాలుగేళ్ల క్రితం మొదటిసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను సరిగా నమోదు చేయలేదని, వీడియో, రాతపూర్వకంగా నమోదు చేయాలని కేంద్రాన్ని కోరిన సీఎం కేసీఆర్ సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి, ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకున్న తర్వాతే మినిట్స్ ను అధికారికంగా విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదల శాఖ సలహాదారు ఎస్కే జోషీ, ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, ఈఎన్సీ మురళీధర్ రావు, నాగేందర్ రావు, నల్లా వెంకటేశ్వర్లు, బి.హరిరాం, కోటేశ్వరరావు పాల్గొన్నారు.