- తల్లిని లేపేందుకు యత్నించిన రెండేళ్ల కొడుకు
పాట్నా: తల్లి లేదని, ఇక తిరిగి రాదని తెలియని ఆ పసిప్రాణం అమ్మను లేపేందుకు ప్రయత్నించి అలసిపోయింది. తల్లి చనిపోయిందని తెలియని వయసులో నవ్వుతూ ప్లాట్‌ఫాం మొత్తం తిరిగి ఆడుకున్నాడు ఆ బుడ్డోడు. బీహార్‌లోని ముజ్‌ఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తీసిన ఒక వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. వలస కార్మికురాలు తిండి లేక, ఎండదెబ్బతో చనిపోతే తల్లి చనిపోయిందని తెలియని ఆ రెండేళ్ల పిల్లాడు శవం పక్కనే కూర్చొని ఆడుకున్నంటున్న ఘటన అందరి హృదయాలను కలిచివేసింది.
శవంపై కప్పిన దుప్పటిని తీసి ఆమెను లేపేందుకు ప్రయత్నించిన పిల్లాడ్ని చూసి అక్కడి వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముజ్‌ఫర్‌నగర్‌కు చెందిన ఒక మహిళ పనుల కోసం గుజరాత్ వలస వెళ్లింది. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో శ్రామిక్ రైలులో ముజఫర్‌పూర్‌కు బయలుదేరింది. కాగా.. ట్రైన్‌లో తినేందుకు తిండి లేక, ఎండ దెబ్బకు కుప్పకూలిపోయింది. రేలు ముజఫర్‌పూర్‌కు చేరుకోగానే చూసిన వారు ఆమె శవాన్ని ప్లాట్‌ఫాంపై పడుకోబెట్టారు. మహిళతో రెండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.