Breaking News

అమృత, ప్రణయ్.. ఆర్​జీవీ

జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ‘మర్డర్’ మూవీ రూపొందిస్తున్నట్టుగా సినిమా పోస్టర్​ను రిలీజ్ చేశాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పోస్టర్ చూడగానే మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత ప్రణయ్​ల ప్రేమకథ అని అర్థమైపోయింది. వర్మ తండ్రికూతుళ్లు అమృత, మారుతీరావు కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ట్విటర్​లో ప్రకటించారు. ‘మర్డర్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనేది సబ్​టైటిల్​గా పెట్టాడు ఆర్జీవీ. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవలే మారుతీరావు కూడా అనుమానాస్పద మృతిచెందారు. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. ఆనంద్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్​టైన్​మెంట్స్​, క్విటీ ఎంటర్​టైన్​మెంట్స్​ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రధానపాత్ర మారుతీరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తుండగా అమృత పాత్రలో సాహితీ నటిస్తోంది. అయితే తమ రియల్ కథ ఆధారంగా వర్మ తీస్తున్న ఈ చిత్రం గురించి ఘాటుగా రియాక్ట్ అవుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది అమృత.

ప్రేమించిన వ్యక్తిని కోల్పోయి, కన్న తండ్రికి దూరమై తన జీవితం అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ‘మర్డర్’ ఫస్ట్‌లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఫీలింగ్ కలిగిందని.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఒకేఒక్క కారణంగా సమాజంలో ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్నానని ఆవేదన చెందుతోంది. ఆత్మగౌరవంతో కాలం వెళ్లదీస్తున్న ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య వచ్చిందని, అయితే.. దీనిని ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని చెప్పింది అమృత. ప్రశాంతంగా బతుకుతున్న నా జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది.. కనీసం ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావడం లేదని ఆమె అంటోంది. తన సినిమా కోసం వర్మ లాంటి ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని అస్సలు ఊహించలేదంటూ.. సాటి మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలిగా ఉందని అమృత వాపోయింది. ఈ స్వార్థపూరిత సమాజంలో వర్మ కూడా ఒకరని తేలిపోయింది.. అయినా ఆయనపై ఎలాంటి కేసు కూడా పెట్టదలచుకోలేదని చెప్పింది. మొత్తానికి మరోసారి సంచలనంగా మారిన అమృత, మారుతీరావు స్టోరీని వర్మ చివరిదాకా కొనసాగించి ప్రేక్షకుల ముందుకి తెస్తారో లేదో చూడాలి.