Breaking News

అభివృద్ధి పనులకు శ్రీకారం

అభివృద్ధి పనులకు శ్రీకారం

సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డులో నిర్మించిన మానవ మలవ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ సమీపంలో రూ.8.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐబీ కార్యాలయం ఎదుట ఎన్ యూఎల్ఎం పట్టణప్రగతి నిధులు రూ.11.5లక్షల వ్యయంతో వీధివ్యాపారుల కోసం నిర్మించిన 25 షాపులను మంత్రి ప్రారంభించారు. 30, 31, 32, 34 వార్డుల్లో రూ.31లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక సంఘం పురపాలక సంఘం సాధారణ నిధులు రూ.1.51 కోట్లతో నిర్మించనున్న సంతృప్త వనం ఆధునిక పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత పాల్గొన్నారు.