Breaking News

అప్పులే .. ఆమ్​దానీ లేదు

  • మన అప్పులు రూ.3లక్షల కోట్లు
  • ఏడాదికి వడ్డీ రూ.15వేల కోట్లు
  • పేరుకుపోతున్న బకాయిలు
  • సర్దుబాటుకు ఆర్థికశాఖ తీవ్ర కసరత్తు
  • ఇప్పటికే బాండ్ల విక్రయంతో రూ.14వేల కోట్ల సమీకరణ

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రం అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయే నాటికి (2 జూన్‌, 2014) తెలంగాణ వాటాగా రూ.60వేల కోట్ల అప్పు మన మీద పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరేండ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లపై చిలుకు అప్పులను సర్కారు తెచ్చింది. వివిధ కార్పొరేషన్ల పేరిట తెచ్చినవి వీటికి అదనంగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి రూ.3లక్షల కోట్లకు చేరాయని అంచనా. పాత అప్పులకు తోడు కొత్త వాటికి కలిపి ఏడాదికి సగటున రూ.14వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల దాకా వడ్డీ చెల్లిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ వడ్డీ రూ.12వేల కోట్ల వరకూ ఉండేది. ఆ తర్వాత రెండేండ్ల కాలంలో ఇవి మరో రెండు, మూడువేల కోట్లకు పెరిగాయని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.

పులి మీద పుట్రలా అప్పులకు తోడు ఇప్పుడు కరోనా వచ్చి పడింది. దీంతో ఖజానాపై మరింత భారం పడింది. ఇటీవల నిర్వహించిన పలు సమీక్ష సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. అంతకు ముందు అసెంబ్లీలోనూ ఆయన ఖజానా పరిస్థితి గురించి ఏకరువు పెట్టారు. ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో అనేక రకాల పొదుపు చర్యలను పాటించబోతున్నట్టు బడ్జెట్‌కు ముందు ప్రకటించారు. కరోనా విజృంభణతో ఒకవైపు టెస్టులు నిర్వహించడం, డాక్టర్లకు పీపీఈ కిట్లు, రోగులకు వైద్య సేవలందించడం, అంతకుముందు రెణ్నెళ్లపాటు పేదలకు రూ.1,500 ఆర్థికసాయం అందించడం తదితర కారణాల వల్ల ఇటీవల అప్పుల భారం మరింత పెరిగిందని సమాచారం. ఈ క్రమంలో తక్షణ, తాత్కాలిక అవసరాల నిమిత్తం నిధులను సర్దుబాటు చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా తయారైంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌, మే నెలల్లో వివిధ బాండ్లను విక్రయించడం, వాటిని కుదువ (తనాఖా) పెట్టడం ద్వారా రూ.14వేల కోట్లను సర్కారు సమకూర్చుకుంది.

పేరుకుపోతున్న బకాయిలు

మరోవైపు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చెల్లించాల్సిన బకాయిలు క్రమక్రమంగా పేరుకుపోతున్నాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, యూనివర్సిటీలు, హాస్టళ్లలో మెస్‌ బిల్లులు, పాలీ హౌస్‌లు, గ్రీన్‌ హౌస్‌లు, రైతులకు సబ్సిడీ కింద ఇచ్చిన ట్రాక్టర్లు, విద్యుత్‌ సంస్థలకు చెల్లింపులు.. తదితరాలన్నీ కలిపి రూ.25వేల కోట్లకు చేరినట్టు అంచనా. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇవి రూ.23 వేల కోట్ల దాకా ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో మరో రూ.రెండువేల కోట్ల దాకా బకాయిలు పెరిగాయని తెలిసింది. వీటన్నింటినీ సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నదనే చర్చ ఇప్పుడు కొనసాగుతోంది. అయితే అభివృద్ధి కోసం ఎన్ని అప్పులైనా చేస్తామంటూ ప్రభుత్వాధినేతలు మొదటి నుంచి ప్రస్తావిస్తున్నారంటూ ఉన్నతాధికారులు గుర్తుచేయడం గమనార్హం.