అనుష్క ప్రధానపాత్రలో హేమంత్ మధుకర్ రూపొందించిన ‘నిశ్శబ్దం’ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ తొలివారంలో విడుదల కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో రెండు నెలలుగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిలీజ్ కానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే థియేట్రికల్ గానే రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
రీసెంట్గా ఇదే విషయాన్ని దర్శకుడు హేమంత్ కూడా మరోసారి ధృవీకరించాడు. సినిమా చూసి సర్టిఫై చేసిన సెన్సార్ సభ్యులు.. కచ్చితంగా ఈ చిత్రాన్ని థియేటర్ లోనే విడుదల చేయమని చెప్పారని.. అందుకు వారికి కృతజ్ఞతలు అని తన ట్వీట్ లో చెప్పాడు. దీంతో థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయనే అంశంపైనే ఈ సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది. మాధవన్, అంజలి, షాలినీ పాండే ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆలస్యంగా వచ్చినా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అద్భుత విజయాన్ని అందుకోనుందేమో చూడాల్సిందే.