Breaking News

అడకత్తెరలో పోక చెక్కలా..!

ఇండియాలో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కరోనా తల్లడిల్లుతున్న జనాలను కాపాడాల్సిన సర్కారు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి పదును పెట్టింది. ఇప్పటికే పనులు లేక ఆదాయం రాక అవస్థలు పడుతున్న జనంపై పెట్రోలియంపై పన్నులు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా చేసింది. దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవితాలను కూడా దుర్భరం చేసింది. రెండు నెలలకు పైగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో చిరు వ్యాపారాల నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల దాకా అన్నీ మూతపడ్డాయి. సామాన్యులైతే తినడానికి తిండికూడా లేక మలమలలాడారు. దేశ ఆర్థిక పరిస్థితితో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా అడుగంటింది. ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన సర్కారు గద్దల్లా పడి పేదల నుంచి డబ్బులు లాక్కుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నుంచి కొంత వెసులుబాటు కలిగి ఇప్పుడిప్పుడే జనం సాధారణ పరిస్థితుల వైపు మళ్లి ఆర్థికంగా కొంత నిలదొక్కుకుంటున్నారు. ఇదే సమయంలో సర్కారు వీరినుంచి డబ్బులు గుంజే పనిలో పడింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గితే పెట్రోలియం ధరలు తగ్గుతాయి.

ముడిచమురు ధరలు పెరిగితే పెట్రోలియం ధరలు పెరుగుతాయని గతంలో కేంద్ర సర్కారు చెప్పింది. కానీ, ఇప్పుడు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా తగ్గినా కేంద్ర సర్కారు పెట్రోలియం ధరలు తగ్గించకపోగా వాటికి మరిన్ని పన్నులు కలిపి ఎక్కువకు అమ్ముతోంది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర తగ్గినా ఆ లాభం ప్రజలకు దక్కకుండా మోదీ సర్కారు ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. దీంతో వరుసగా 13 రోజుల పాటు వరుసగా పెట్రోల్‌ ధరలు ధరలు పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం పెట్రోల్‌ లీటరు ధర హైదరాబాద్‌లో రూ.82.25కు చేరగా, డీజిల్‌ ధర 78.27 రూపాయలుగా ఉంది. మొత్తానికి సర్కారు పెట్రోల్‌పై లీటరుకు దాదాపుగా 64శాతం అంటే రూ.50.69, డీజిల్‌పై లీటరుకు 63శాతం అంటే రూ.49.43 పన్నుల రూపంలో వసూలు చేస్తోంది. సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి పెట్రోల్‌ లీటరు ధర 85 రూపాయల వరకు చేరవచ్చని పెట్రోలియం సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. గ్యాస్‌ ధరలను కూడా ఇప్పటికే పెంచారు. ఇంకా వాటి ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదముంది. ఇలా పెట్రోలియం ధరలు భారీగా పెంచుతుండడంతో వాటి ప్రభావం రవాణా వ్యవస్థపై నేరుగా పడుతుంది. దీంతో రవాణా చార్జీలు కూడా పెరిగి అవి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలా సామాన్యులు నిత్యావసర వస్తువులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా కాలంలో ఆర్థికంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సింది పోయి.. కరోనా కాలంలోనూ కేంద్ర సర్కారు కక్కుర్తి పనులకు పాల్పడుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సర్కారు కనికరించి పెట్రోలియం ధరలను తగ్గించాలని కోరుతున్నారు.