సారథి న్యూస్, కర్నూలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేల ఆర్థిక సాయం అందజేసేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్చేయూత’ పథకాన్ని సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు ఆఫీసులో ప్రారంభించారు. సుమారు 23 లక్షల మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నగదుబదిలీ చేస్తారు. అందుకోసం ప్రభుత్వం ఏటా రూ.4,687 కోట్లు ఖర్చుచేస్తారు. ఇంకా మహిళలకు ఆదాయం సమకూర్చేలా అమూల్, పీ అండ్ జీ వంటి సంస్థలతో కూడా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చేవారని, ఊరిలో ఒకరికో, ఇద్దరికో మాత్రమే వచ్చేదని, అది కూడా లంచం ఇస్తేనే సహాయం అందేదని గుర్తుచేశారు. తద్వారా ఎవరికీ ఉపయోగం లేకపోగా, మిగిలిన వర్గాలకు ఈర్ష్య కలిగించేలా ఉండేదన్నారు. వైఎస్సార్ చేయూత పథకంలో మహిళలకు అందజేస్తున్న ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని తెలిపారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు ఇతర రుణాల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో ద్వారా ప్రభుత్వం అందిస్తున్న డబ్బును సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎం.శంకరనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.