Breaking News

అందుకే రాజ్యసభ ఎన్నికలు ఆలస్యం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు దారుల కోసమే రాజ్యసభ ఎలక్షన్స్‌ను లేట్‌ చేశారని బీజేపీపై విమర్శలు చేశారు. గుజరాత్‌, రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మకాలు పూర్తికాలేదు కాబట్టే ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేశారని ఆరోపించారు. ‘రాజ్యసభ ఎన్నికలు రెండు నెలల క్రితమే జరగాల్సి ఉంది. రాజస్థాన్‌, గుజరాత్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాలు పూర్తికాలేదు. అందుకే డిలే చేశారు. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిరాయిపుల ద్వారా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు? ప్రజలు ప్రతి విషయం అర్థం చేసుకుంటారు’ అని గెహ్లాట్‌ విమర్శించారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.25 కోట్లు ఆఫర్‌‌ చేసిందని గెహ్లాట్‌ గతంలో ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించారు. అయితే గెహ్లాట్‌ చేసిన ఆరోపణలను రాజస్థాన్‌ బీజేపీ చీఫ్‌ ఓనియా ఖండించారు. ‘దేశంలో 55 ఏళ్ల నుంచి హార్స్‌ ట్రేడింగ్‌ చేస్తున్న వారు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి’ అని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. కాగా కాంగ్రెస్‌కు మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉంది. అంతే కాకుండా 12 నుంచి 13 మంది ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కే సపోర్ట్‌ చేస్తున్నారు. బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఆరుగురు ఇండిపెండెంట్లు వారికి సపోర్ట్‌ చేయనున్నారు.