Breaking News

సమతను నేర్పిన మహర్షి

సమతను నేర్పిన మహర్షి

దేవుడిని అతిసామాన్యుడి వద్దకు తీసుకొచ్చి దేవుడికి కులమత భేదాలు లేవని నిరూపించిన మహా దార్శనికుడు మహర్షి నారాయణగురు. ఆయన దేవాలయాలు భక్తి, ముక్తి కేంద్రాలుగా కాకుండా మలచిన మహాశిల్పి, సాహసికుడు. మానవులను అనాదిగా పట్టి పీడిస్తున్న అంధకారాన్ని ఙ్ఞానంతో తొలగించ వచ్చని, ఙ్ఞానం విద్యతోనే సాధ్యమని భావించి, అతి సామాన్యుడికి చదివించేందుకు అలుపెరుగని కృషి చేసిన మహాయోగి. చదువుతోనే స్వేచ్ఛ, సంఘటిమవడం ద్వారా శక్తి, చదువు అనేది స్వేచ్ఛ, సమానత్వాలను సాధించుకునేందుకు నిచ్చెనలా ఉపయోగపడుతుందని ప్రభోదించారు. మహాఙ్ఞాని, తత్వవేత్త అయిన నారాయణగురు కేరళ రాజధాని తిరువనంతపురానికి 11 కి.మీ. దూరంలో చంపళంతి అనే గ్రామంలో 1856 ఆగస్టు 20న మదన్ ఆసన్, కుట్టియమ్మ అనే వ్యవసాయదారుల కుటుంబంలో జన్మించారు.


తండ్రి మధ్య తరగతి రైతు, తల్లి ఇల్లాలు. ముగ్గురు ఆడపిల్లల అనంతరం నారాయణగురు జన్మించారు. కేరళ రాష్ట్రంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో వలే కులవివక్ష తీవ్రంగా ఉండేది. కేరళలో బ్రాహ్మణ నంబూద్రీలు, నాయర్ల వంటి ఆధిపత్యకులాలు శూద్రులు అతిశూద్రులపై అస్పృశ్యత పాటించేవారు. నారాయణగురు వివక్ష చూసి సహించలేకపోయేవారు. అందుకే బ్రాహ్మణాధిపత్యంలోని దేవాలయాలకు పోటీగా సొంత ఆలయాలను నిర్మించి సామాజిక విప్లవానికి తెరతీశారు. సొంతంగా వేదాలను హిందూ ధర్మశాస్త్రాలను ఔపాసన పట్టారు. పెద్దలు ఆయన ఇష్టంతో పనిలేకుండా మేనరికం అమ్మాయి కాళిఅమ్మతో పెళ్లి నిశ్చయించారు. నాటి సంప్రదాయం ప్రకారం ఒకసారి అత్తారింటికి వెళ్లి భోజనం చేయాలి. అలా చేయకుండా కాళిఅమ్మ వద్ద సెలవు తీసుకుని దేశాటనకు వెళ్లారు.

కేరళ రాజధాని తిరువనంతపురానికి దక్షిణాన 40 కి.మీ. దూరంలో ఉన్న అలువిప్పురం అనే గ్రామంలో 1888 మహాశివరాత్రి రోజున ఉదయం ఒక శివలింగాన్ని వేలాది మంది భక్తుల మధ్య ప్రతిష్ఠించారు. ఇది బ్రాహ్మణ పూజార్లకు సవాల్. ఇది ఒక సరికొత్త సామాజిక విప్లవానికి నాంది పలికిందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ సంఘటనను సహించలేని బ్రాహ్మణులు నారాయణ గురును నిలదీశారు. ఈ శివుడు మీ శివుడు కాదనీ మా శూద్రుశివుడని వారు నిర్ఘాంతపోయే సమాధానం చెప్పారు. దేవాలయాలు స్వచ్ఛతకు, ప్రగతికి కేంద్రాలుగా ఉండాలని నారాయణ్ గురు భావించేవారు. ఆలయాలకు అనుబంధంగా తోటలు, ఉపన్యాస మందిరాలు, గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలను నారాయణ్ గురు స్థాపించారు. సుమారు పదివేలకుపైగా ఆలయాలను స్థాపించారు. తాను స్థాపించిన దేవాలయాల్లో గుడికి అల్లంత దూరంలో ఉండి మొక్కే శూద్రులను దేవుడి విగ్రహం పక్కన నిలబెట్టారు. అసలు ఆయన ఉద్దేశ్యం మెజారిటీ ప్రజల సమీకృతం చేసేందుకు, దయనీయ స్థితి నుంచి, ఆత్మన్యూనతా భావం నుంచి బయటకు తీసుకురావడమే. ఒక దశ తర్వాత ఆయన శిష్యులకు ఇక దేవాలయ నిర్మాణాలు చాలని, దానికోసం ధనం వృథా చేయొద్దని కోరారు.

నారాయణ్ గురు జీవితకాలం సంపాదకుడిగా ‘వివేకోదయం’ అనే పత్రికను నడిపారు. కులరహిత సమాజం కోసం కులాంతర వివాహలు, సహపంక్తి భోజనాలనూ ప్రోత్సాహించారు. 40 ఏళ్ల సామాజికోద్యమంలో ఆయన విద్య, సమానత్వం, సమ సమాజం కోసం జీవితాంతం కృషిచేశారు. రవీంద్రనాథ్​ఠాగూర్ నారాయణ గురును 1922 నవంబర్​లో శివగిరి ఆశ్రమంలో కలిశారు. తర్వాత ఠాగూర్ ఆయన గురించి నారాయణ గురును మించిన, ఆయనతో పోల్చదగిన ఆధ్యాత్మికవేత్తను తాను ఎన్నడూ చూడలేదని ప్రశంసించాడు. ఇంతటి మహర్షి సెప్టెంబర్ 20, 1928న మహాపరినిర్వాణం చెందారు.

:: ఆర్​కే