Breaking News

ప్రజల యాదిలో జాన్ విల్సన్

ప్రజల యాదిలో జాన్ విల్సన్

సారథి న్యూస్, హుస్నాబాద్: మూడు దశాబ్దాలుగా ప్రజల యాదిలో పదిలంగున్న నాటి పోలీస్ అధికారి హుస్నాబాద్ ఎస్సై జాన్ విల్సన్. ప్రజాపోరాటాల వల్లే సమసమాజ స్థాపన జరుగుతుందని భావించిన పీపుల్స్ వార్, అభ్యుదయవాదులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ల మధ్య పల్లెలు నలిగిపోతున్న తరుణమది. రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక ప్రాంతంమైన హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా జాన్ విల్సన్ విధుల్లో చేరాడు. నేడు ప్రభుత్వం అవలంబిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను 28ఏండ్ల క్రితమే ఆయన ప్రారంభించాడు. ప్రజలకు ఎలాంటి సమస్యలొచ్చినా స్టేషన్​కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని చెప్పిన పోలీస్ అధికారి. ఆయనకు పెళ్లి కుదరడంతో వారం రోజుల పాటు సెలవు పెట్టాడు. మరుసటి రోజు సొంత ఊరుకు వెళ్లేందుకు సిద్ధపడగా నక్సల్స్ పేల్చిన మందుపాతరకు 15మంది బలైపోయారు. నాటి పోలీసుల అమరత్వం చిరస్మరణీయంగా హుస్నాబాద్ ప్రజల గుండెల్లో పదిలపరుచుకున్నారు.
15 మంది బలి
అప్పటి హుస్నాబాద్ మండలం రామవరం గ్రామంలో 1991 డిసెంబర్ 18వ తేదీ నైట్ హాల్టింగ్ వెళ్లిన బస్సును పీపుల్స్ వార్ సభ్యులు దహనం చేశారు. 19వ తేదీ సాయంత్రం పూటబస్సు దహనం కేసును దర్యాప్తు చేసుకుని మరో ఆర్టీసీ బస్సులో తిరిగి వస్తుండగా రామవరం గ్రామ శివారు ప్రాంతంలో ఇన్​చార్జ్​సీఐ యాదగిరి, హుస్నాబాద్ ఎస్సై జాన్ విల్సన్, సీఆర్పీఎఫ్ ఎస్సై కాశ్మీరిలాల్, సీఆర్పీఎఫ్ జవాన్లు అబ్రహం, హోషియర్ సింగ్, కె.రాజన్, స్టేషన్ మేనేజర్ రంగనాథస్వామి, హుజురాబాద్ డిపో కంట్రోలర్ వెంకటరెడ్డి, కండక్టర్లు దుర్గారెడ్డి, సీహెచ్ దుర్గయ్య, వి.వెంకటరెడ్డి, డ్రైవర్ టి.ఎల్లయ్య పోతారం(జే), మాజీ మిలిటెంట్​లు పొన్నాల శంకర్( మీర్జాపూర్), చౌదరి రమేష్ (హుస్నాబాద్), గౌరవెల్లి గ్రామ సేవకులు లెట్టె కనకయ్య, నూనె వెంకటమల్లు 15 మంది అక్కడికక్కడే చనిపోయారు.
వారం రోజుల్లో జాన్ విల్సన్ వివాహం
నాడు హుస్నాబాద్ లో పీపుల్స్ వార్ ప్రాబల్యం అత్యధికంగా కొనసాగుతున్న తరుణంలో 1989వ బ్యాచ్​కు చెందిన జాన్ విల్సన్ ప్రొబెషనరీ ఎస్సైగా కరీంనగర్ రెండవ ఠాణాలో పనిచేసి మొదటి పోస్టింగ్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట ఎస్సైగా బాధ్యతులు చేపట్టారు. అనంతరం 1990లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. వారం రోజుల్లో పెళ్లి ఉండగా సంఘటనకు ముందు రోజు విధులకు సెలవు పెట్టారు. తెల్లవారి సొంతూరు వరంగల్ జిల్లా డోర్నకల్కు బయలుదేరాల్సి ఉండగా బస్సు దహనం ఘటన చోటు చేసుకుంది. అప్పటి హుస్నాబాద్ సీఐ సెలవుల్లో ఉండగా ఇన్​చార్జ్ ​సీఐ యాదగిరితో కలిసి జాన్ విల్సన్ దర్యాప్తు చేసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మందుపాతరకు బలయ్యారు.
పేదల పెన్నిధి జాన్ విల్సన్
హుస్నాబాద్ ఎస్సైగా జాన్ విల్సన్ ఏడాదిన్నర పాటు సేవలందించగా అతి తక్కువ సమయంలోనే పేదల పెన్నిధిగా పేరుతెచ్చుకున్నారు. ప్రజలు తమ న్యాయం కోసం నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని చెప్పిన పోలీస్ అధికారి. నాడు విప్లవం ఉధృతంగా ఉన్న పరిస్థితుల్లో యువత విప్లవోద్యమం వైపుకు మళ్లకుండా పేద కుటుంబాలకు దగ్గరై, మండలంలోని ప్రజలతో మమేకమైపోయారు. ఆయన18వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని జాన్ విల్సన్ చారిటబుల్ ట్రస్ట్, స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ స్టేషన్ ఎదుట అధికారులు విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయనను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు నివాళులర్పిస్తారు.
నా బ్యాచ్ మెట్

జాన్ విల్సన్ నా బ్యాచ్ మెట్​. ఆయన నిత్యం పేదల సమస్యల పరిష్కారం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి. క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకితభావంతో పని చేస్తూ దశాబ్దాల క్రితమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలుచేసిండు. విధుల్లో చేరిన అనతి కాలంలోనే ప్రజల మన్ననలు అందుకోగా అసాంఘిక శక్తుల చేతుల్లో అమరత్వం పొందారు. ఈ ప్రాంతంలో విధినిర్వహనలో జాన్ విల్సన్ చేసిన నాటి సేవలు నేటికి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నాయి.
:: సందెపొగు మహేందర్, ఏసీపీ, హుస్నాబాద్


యువ పోలీసులకు ఆదర్శం

ప్రజల రక్షణ కోసం పాటుపడుతున్న యువ పోలీసులకు జాన్​ విల్సన్ ఆదర్శం. నాడు సామాన్యులు స్టేషన్ కు రావాలంటే భయబ్రాంతులకు గురయ్యే పరిస్థితులుండేవి. ప్రతి ఒక్కరూ తమ సమస్యల పరిష్కారానికి స్టేషన్ కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని చెప్పిన సమాజ హితుడన్నారు. ఆయనలోని స్ఫూర్తి, పట్టుదలనే నేటి యువ పోలీసులకు మార్గదర్శకుడయ్యాడు.
:: సజ్జనపు శ్రీధర్, ఎస్సై హుస్నాబాద్