
అబుదాబి: ఐపీఎల్13 సీజన్లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన 50వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్పంజాబ్పై రాజస్తాన్రాయల్స్7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన పంజాబ్ దూకుడుకు బ్రేక్ పడినట్లయింది. రాజస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్చేసిన కింగ్స్ పంజాబ్ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 4×6, 6×8), కేఎల్ రాహుల్ (46;41 బంతుల్లో 4×3, 6×2) రాణించడంతో పాటు పూరన్(22; 10 బంతుల్లో 6×3) ఆశించిన స్థాయిలో స్కారు చేయగలిగారు. కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ రెండు వికెట్ల చొప్పున తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఇటు బెన్ స్టోక్స్(50, 26 బంతుల్లో 4×6, 6×3), అటు రాబిన్ ఊతప్ప (30, 23 బంతుల్లో, 4×1, 6×2) మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. రన్ రేట్ 11 ఓవర్ల వరకు 10 తగ్గలేదు. ఆ తర్వాత వచ్చిన శాంసన్ (48, 25 బంతుల్లో 4×4, 6×3) స్కోరు బోర్డు వేగం పెంచే క్రమంలో రనౌట్ అయ్యాడు. ఇక స్మిత్(31, 20 బంతుల్లో 4×5), జేసీ బట్లర్(22, 11 బంతుల్లో 4×1, 6×2) దూకుడగా ఆడడంతో 17.3 ఓవర్లలో రాజస్తాన్మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులను పూర్తిచేసింది. కింగ్స్పంజాబ్బౌలర్లలో అశ్విన్, సీజే జోర్డన్చెరో వికెట్చొప్పున తీశారు.
గేల్ జస్ట్ మిస్

క్రిస్ గేల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 99(63 బంతుల్లో 4×6, 6×8)పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి గేల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. బంతి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్‌ను తాకుతూ వెళ్లి వికెట్లను గిటేసింది. దీంతో కొంచె అసహనానికి గురైన గేల్ బ్యాట్‌ను విసిరేశాడు. సెంచరీ ముందు ఔట్ కావడంతో తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. ఆ తర్వాత తేరుకున్న గేల్ బ్యాట్ తీసుకుని వెళ్లి ఆర్చర్‌ను అభినందించాడు.