
షార్జా: ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా 31వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ను మంచి ఆటతో గేల్ ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అరోన్ ఫించ్(20), దేవదూత్ పడిక్కల్(18) నిరాశపరిచారు. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఫించ్ ఔట్ కాగా, అర్షదీప్ బౌలింగ్‌లో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. కోహ్లి(48; 39 బంతుల్లో 3 ఫోర్లు) జట్టు స్కోరును నడిపించాడు. శివం దూబే(23; 19 బంతుల్లో 2 సిక్స్) మెరుపులు మెరిపించాడు. ఏబీ డివిలియర్స్(2) ఘోరంగా విఫలమయ్యాడు. క్రిస్ మోరిస్(25 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) బ్యాట్ ఝుళిపించాడు. ఆర్సీబీ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మిగతా ఆర్సీబీ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(13), ఉదాన(10 నాటౌట్; 1సిక్స్)లు ఫర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్‌లు రెండు వికెట్లు చొప్పున తీశారు.. అర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ ఒక్కో వికెట్చొప్పున తీశారు.
లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పంజాబ్..స్టార్‌ప్లేయర్ గేల్ తన మార్క్ ఆటను చూపించాడు. 45 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్(61 నాటౌట్; 49 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు) రాణించడంతో పంజాబ్ విజయం సాధించింది. జట్టులో మయాంక్ అగర్వాల్(45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మంచి ఆరంభాన్నిచ్చాడు. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులతో విజయం సాధించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో చాహల్మూడు ఓవర్లు వేసి ఒక వికెట్మాత్రమే తీయగలిగాడు.