- మంత్రి హరీశ్‌రావు
సారథి న్యూస్, రామాయంపేట: రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి, తెలంగాణ రాష్ట్ర రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ నియంత్రిత వ్యవసాయ సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వానాకాలంలో మొక్కజొన్న పంటను వేయొద్దని సూచించారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానానికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసిన మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచామన్నారు. అన్నదాతలు తెలంగాణ సోనా రకాన్ని సాగుచేయాలని సూచించారు.
డబుల్ ఇళ్లకు శంకుస్థాపన
నిజాంపేటలో రూ.ఆరుకోట్ల వ్యయంతో నిర్మించనున్న 104 డబుల్ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి హరీశ్‌రావు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలసి ఆదివారం శంకుస్థాపన చేశారు. 15 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమచేస్తామన్నారు. రూ.25వేలలోపు ఉన్న రైతుల లోన్లను మాఫీచేశామన్నారు. రూ.లక్షలోపు ఉన్న రైతులకు నెలలోపు 25శాతం డబ్బులను జమచేస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఇఫ్కో, డీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఏవో పరుశురాం నాయక్ పాల్గొన్నారు.