- నేటికీ పూర్తికాని గ్రంథాలయ భవనం
- రూ.25లక్షల పైనే నిధులు మంజూరు
సారథి న్యూస్, మానవపాడు (జోగుళాంబగద్వాల): అందరికీ ఉపయోగపడే గ్రంథాలయ భవనం అది.. రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉంది. నిధులు మంజూరైనప్పటికీ పూర్తికావడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో 2002లో అలంపూర్ నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి భవన నిర్మాణానికి భూమి పూజచేసి అప్పట్లోనే రూ.8లక్షలు మంజూరు చేశారు. అయితే అప్పట్లో కప్పు లెవల్ వరకు కట్టి వదిలేశారు. ఏడేళ్ల తర్వాత మళ్లీ రూ.4లక్షలు మంజూరుచేసి మళ్లీ కొంత ముస్తాబుచేసి వదిలేశారు. ఇటీవల ఐదేళ్ల క్రితం మళ్లీ నిర్మాణం మొదలెట్టారు. మళ్లీ రూ.8లక్షలు మంజూరు చేశారు. ఇప్పటికీ నిర్మిస్తూనే ఉన్నారు.. కానీ నిర్మాణం పూర్తవడం లేదు. బిల్డింగ్పూర్తయినా తలుపు, కిటికీలు బిగించేందుకు నిధులు లేవని పనులు ఆపేశారు. ఈ భవనాన్ని 20 ఏళ్లుగా నిర్మిస్తూనే ఉండడం ఏమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రంథాలయం మండల పరిషత్ నివాస క్వార్టర్స్‌లో కొనసాగుతుండడం, చిన్నపాటి గదిలో ఉండడంతో పాఠకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్లు తమ పబ్బ గడుపుకోవడానికే ఈ భవన నిర్మాణం కొనసాగుతుందేమోనని పాఠకులు విమర్శిస్తున్నారు.
త్వరలోనే కంప్లీట్ చేస్తాం: ఏఈ నరేందర్
ఈ విషయంపై పంచాయతీ రాజ్ ఏఈ నరేందర్ ను వివరణ కోరగా.. 2002లో గ్రంథాలయ భవన నిర్మాణం కోసం భూమిపూజ చేసింది వాస్తవమేనని ఆ పదేళ్లు భవన నిర్మాణం కోసం ఎన్ని నిధులు మంజూరు చేశారో తనకు తెలియదన్నారు. కాంగ్రెస్ హయాంలో జడ్పీటీసీ సభ్యురాలు ప్రశాంతిరెడ్డి రూ.2 లక్షలు, గ్రంథాలయ శాఖ నుంచి రూ.4 లక్షలు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భవన నిర్మాణం కోసం రూ.4 లక్షలు మంజూరయ్యాయి. తలుపులు, కిటికీలు, రంగులు వేసేందుకు గత వారం రూ.4 లక్షల్లోపు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రారంభిస్తామని ఏఈ తెలిపారు.