ప్రజంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలకు.. మల్టీ స్టారర్ చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంతకు ముందు లేని విధంగా భారీ సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టీస్టారర్ ‘రౌద్రం రుధిరం రణం’.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 20వ పాన్ ఇండియన్ మూవీ.. ఇంకా అల్లు అర్జున్ ‘పుష్ప’ ఇలా అన్నీ పెద్ద సినిమా రేంజ్ల సిద్ధమవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి కూడా ఓ భారీ మల్టీస్టారర్ ను రూపొందించనున్నారట. మంచు ఫ్యామిలీ చాలారోజులుగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. అప్పుడప్పుడు మోహన్ బాబు ప్రత్యేక పాత్రల్లో కొనసాగుతున్నా.. విష్ణు, మనోజ్ సోలోగా విజయాలు మాత్రం అందుకోలేదు.
గాయత్రి సినిమాతో సక్సెస్ అందుకోవాలని మోహన్ బాబు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ సినిమాపై పెట్టిన బడ్జెట్ కూడా రాలేదు. అయితే వీరు ముగ్గురు కూడా ఓ భారీ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు తన కొడుకులతోనే మల్టీస్టారర్ సినిమాను సొంత బ్యానర్లో తీయాలని అనుకున్నాడట. ఇదివరకు మంచు హీరోలు ముగ్గురూ కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత వాళ్లు కలిసి మళ్లీ నటించలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని ఈ ఫ్యామిలీ నిశ్చయించుకున్నారట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని మోహన్ బాబు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి కలిసికట్టుగా నైనా హిట్ సాధిస్తారేమో చూద్దాం.