ముంబై: మహారాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. జితేంద్ర అవధ్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్) కరోనా బారినపడగా తాజాగా, సామాజిక న్యాయశాఖ మంత్రి, ఎన్సీపీ నేత ధనుంజయ్ ముండేకు కరోనా వైరస్ ప్రబలింది. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలినా వైరస్ లక్షణాలు మాత్రం ఆయనలో లేవని ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. రెండు రోజుల క్రితం ధనుంజయ్ ఎన్సీపీ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. దీంతో ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, నాయకులకు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని రాజేశ్ తోపే తెలిపారు. ప్రస్తుతం మంత్రి ధనుంజయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాకపోతే శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారని రాజేశ్ తోపే పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనను దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
- June 13, 2020
- Archive
- జాతీయం
- షార్ట్ న్యూస్
- MAHARASTRA
- NCP
- కరోనా
- మహారాష్ట్ర
- Comments Off on మహారాష్ట్ర మంత్రులకు కరోనా