Breaking News

మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

మరికొద్ది గంటల్లో అయోధ్యలో మహాఘట్టం

న్యూఢిల్లీ: అయోధ్య మహాఘట్టానికి వేళయింది. ఆలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో బృహత్తర రామాలయం నిర్మాణానికి మరికొన్ని గంటల్లో భూమిపూజ మహోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకలను ప్రతిష్ఠించి..నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్‌ తదితరులు రానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇదీ చరిత్ర
సరయూనది ఒడ్డున ఉన్న అయోధ్య నగరం కోసల రాజ్య రాజధానిగా వెలుగొందింది. త్రేతాయుగం నుంచి ఇది శ్రీరామచంద్రుడి జన్మస్థానమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడి ఆలయాన్ని మొగల్‌ పాలకుడు బాబర్‌ హయాంలో అతడి సేనాపతి మీర్‌ బాకీ 1528లో విధ్వంసం చేసి రామాలయ శిథిలాలపై బాబరు పేరిట బాబ్రీ మసీదు నిర్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. 1528 నుంచి 1822 వరకు ఆలయం కోసం డిమాండ్‌ ఉన్నా ఎక్కడా ఘర్షణలు జరగలేదు. ఆ తర్వాత అయితే దాదాపు 79 ఏళ్ల పోరాటం అనంతరం వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని గతేడాది నవంబర్​ 9న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా ఇప్పుడు ఆలయ నిర్మాణం మొదలుకాబోతోంది..
ప్రపంచవ్యాప్తంగా..
భూమిపూజను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యనదుల జలాలను తీసుకొస్తున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం జరిగే హనుమాన్‌గఢీ పరిధిలో 8 కి.మీ.మేర ఏడువేల దేవాలయాలు ఉన్నాయి. 5న ఈ ఆలయాల్లో దీపాలు వెలిగించి వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, కెనడా, కరేబియన్‌ దీవులు సహా పలు విదేశాల్లోని భారతీయులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని తిలకించనున్నారు.
ఎల్‌ అండ్‌ టీకి బాధ్యతలు
వాస్తుశాస్త్రం ప్రకారం మూడంతస్తుల్లో ఆలయ నిర్మాణం జరగనుంది. దిగువ అంతస్తులోనే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన చేయనున్నారు. ఐదు మండపాలైన నృత్య మండపం, సింహద్వార్‌, పూజామండపం, రంగ్‌ మండపం, గర్భగృహం ఉంటాయి. 27 నక్షత్ర వాటికలను ఏర్పాటుచేస్తారు. భక్తులు తమ జన్మదినాన ఇక్కడి చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. భూమిపూజ అనంతరం రామ్‌లల్లాను ఆలయ సముదాయంలోని శేషావతార్‌ ఆలయంలో తాత్కాలికంగా ప్రతిష్ఠిస్తారు. ఆలయ సముదాయంలో ప్రార్థనా మందిరం, ఉపన్యాస వేదిక, వేద పాఠశాల, సంత్‌ నివాస్‌, యాత్రి నివాస్‌లను నిర్మిస్తారు. ఆలయ నిర్మాణ పనులను ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేపడుతోంది. మూడున్నరేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని అంచనా.