సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి రెండో దశ లాక్ డౌన్…
సారథి న్యూస్, నల్లగొండ: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలుచేయనున్నట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ప్రకటించారు. కరోనా(కోవిడ్–19) వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా లాక్ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలుచేయడమే కాకుండా వాటిని ఎవరు ఉల్లంఘించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని రెడ్ జోన్లు, కంటైన్ మెంట్ ప్రాంతాల పరిధిలో నివాసం ఉంటున్న ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానిచ్చేది లేదన్నారు. అదే సమయంలో ఎవరైనా బారికేడ్లు దాటుకుని వచ్చినా, నిబంధనలు అతిక్రమించినా కేసులు నమోదుచేసి క్వారంటైన్ కేంద్రాలను తరలిస్తాని, ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా సహకరించాని కోరారు. సమావేశాలు ఏర్పాటు చేయకుండా, ఎక్కువ మంది కార్యకర్తలతో తిరగకుండా మరింత బాధ్యతాయుతంగా సహకరించాలని ఎస్పీ రంగనాథ్ సూచించారు.
ప్లేట్లలో భోజనం పెట్టే విధానాన్ని అనుమతించం
జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక చోటుకు భోజనం తీసుకొచ్చి ప్లేట్లలో భోజనం పెడుతున్నారని, ఇకపై ఆ విధానాన్ని అనుమతించబోమని ఎస్పీ తెలిపారు. జిల్లాలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలు, రాజకీయ పార్టీ ప్రతినిధులకు, వ్యక్తిగతంగా దాతృతంతో సేవ చేస్తున్న ఎవరికి తాము వ్యతిరేకం కాదని, భోజన వితరణ చేసే వారంతా పార్సిల్ విధానంలో అన్నదానం చేయాలని సూచించారు. ప్లేట్స్ లో భోజనం పెట్టే విధానంలో ఎక్కువ మంది ఒకే దగ్గరకు చేరుకోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందన్నారు. అన్నదానం చేసే వారు విధిగా మాస్కులు, హ్యాండ్ గ్లౌస్ లు వాడాలని సూచించారు. అదే విధంగా నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసే సమయంలోనూ ఎక్కువ మంది ఒకేచోట లేకుండా చూసుకోవాలని, విధిగా సామాజిక దూరం పాటించి కార్యక్రమాలు నిర్వహించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రంగనాథ్ స్పష్టంచేశారు.