మయన్మార్: నార్త్ మయన్మార్లో ఘోరప్రమాదం సంభవించింది. జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడడంతో వంద మంది చనిపోయారు. ఒక్కసారిగా మట్టి, నీళ్లు వచ్చిపడడంతో చాలా మంది చనిపోయారని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, ఇంకా చాలా మంది మట్టిలో కూరుకుపోయారని అన్నారు. ఇప్పటివరకు వంద మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
కచిన్ జిల్లాలో భారీవర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని, గని దగ్గరలో పనిచేస్తున్న వారిపై కొండచరియలు విరిగిపడడంతో ఘటన జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ‘ఒక్కసారిగా టవర్ కూలిపోయినట్లు మొత్తం కింద ఉన్న వాళ్లపై పడింది. వాళ్లంతా సాయం సాయం అని కేకలు వేశారు. కానీ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. నిమిషాల్లో అందరూ దాని కింద పడి సమాధి అయిపోయారు. నాకు ఇప్పటికీ తలచుకుంటే భయంగానే ఉంది’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.