- స్వయం సమృద్ధి భారత్ లక్ష్య సాధనలో కర్షకులే కీలకం
- ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ
న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి భారత్ లక్ష్య సాధనలో కర్షకులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కొవిడ్-19 సంక్షోభ కాలంలో మన దేశ వ్యవసాయ రంగ శక్తి ఏమిటో తెలిసిందన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం జరిగే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వ్యవసాయ రంగ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సారి తన ప్రసంగంలో వ్యవసాయ రంగం, రైతులస్థితిగతులను ప్రస్తావించారు. కొన్ని రాష్ట్రాల్లో ‘వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం(ఏపీఎంసీ)’ నుంచి పండ్లు, కూరగాయల్ని మినహాయించిన తర్వాత రైతులు భారీ ఎత్తున లాభపడ్డారని అన్నారు. సాగుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన ఆర్థికతత్వ ప్రాముఖ్యాన్ని మనం గతంలోనే గుర్తించి ఉంటే ఇప్పుడు స్వయం సమృద్ధి నినాదం అవసరం ఉండేది కాదని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిలో కథలు చెప్పడానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు. నాగరికతతో పాటే కథలు చెప్పే సంస్కృతి కూడా విస్తృతమైందన్నారు. శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన కథలు ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ‘బెంగళూరు స్టోరీటెల్లింగ్ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. ప్రతి కుటుంబం నేటి నుంచి కొంత సమయాన్ని కథలు చెప్పడానికి కేటాయించాలని కోరారు. ఈ సంస్కృతి మన జీవితాల్లో అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుందన్నారు..