Breaking News

ప్రూఫ్​​ ఉంటేనే బయటికి రావాలి

సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్​ రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్​ రెడ్డి
  • లాక్​ డౌన్​ మరింత కఠినతరం
  • ప్రభుత్వ ఉద్యోగులకు కలర్​ పాస్​లు
  • డీజీపీ మహేందర్ రెడ్డి

సారథి న్యూస్​, హైదరాబాద్​: అడ్రస్​ ప్రూఫ్​ ఉంటేనే బయటికి రావాలని డీజీపీ మహేందర్​ రెడ్డి సూచించారు. విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు రోజుకు ఒకటి చొప్పున ఆరు రోజులకు ఒక్కో కలర్​ పాస్​ చొప్పున ఇస్తామన్నారు. కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో సోమవారం ఆయన డీజీపీ ఆఫీసులో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. అవసరమైన సరుకులు కొనడానికి మూడు కి.మీ. దూరం దాటి రావొద్దని ఆయన సూచించారు. బయటికి వచ్చేవారు రెసిడెన్సీ ప్రూఫ్​ తప్పనిసరి తీసుకురావాలన్నారు. రాష్ట్రమంతా లాక్ డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్​ సిటీలో రోడ్లపై తిరిగే వెహికిల్స్​ సంఖ్య పెరిగిందన్నారు. లాక్​ డౌన్​ సమయంలో మొదట్లో ఎమర్జెన్సీ సర్వీసెస్​ కు మినహాయింపు ఇచ్చామన్నారు. వారికి ఇచ్చిన పాస్​లపై రివ్యూ చేస్తామన్నారు. పాస్​ ఉంది కదా అని బయటికొస్తే వాటిని రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లినా మాస్క్​లు తప్పనిసరి ధరించాలని, సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని సూచించారు. హాస్పిటల్​కు వెళ్లే వారు సైతం రెసిడెన్సీ ప్రూఫ్​ ​, ప్రిస్క్రిప్షన్ చూపించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వెళ్లే వారు సంబంధిత పత్రాలను తీసుకురావాల్సిందేనని సూచించారు. ఆహార  పదార్థాలు పంపిణీ చేస్తున్నవారు దూరం పాటించాల్సిందేనని అన్నారు.

యువకుల్లో మార్పురావాలి

వాహనాలు సీజ్ చేసినా కొంత మంది యువకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలను సీజ్ చేశామన్నారు. వారిపై కేసులు నమోదుచేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. సూపర్​ మార్కెట్ల వద్ద సోషల్​ డిస్టెన్స్​ పాటించకపోతే సూపర్​ మార్కెట్ల​ను సీజ్​ చేస్తామన్నారు. కాలనీలు, రెసిడెన్షియల్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ వారు ఇతరులను అనుమతించకూడదన్నారు. లాక్​ డౌన్​ సమయంలో పోలీసులు బాగా కష్టపడుతున్నారని, పోలీస్​శాఖ కృషిని మెచ్చిన సీఎం కేసీఆర్​ 10శాతం గిఫ్ట్​ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మే 7 వరకు కంటైన్​ మెంట్ ప్రాంతాల్లో ఎవరూ బయటికి రాకుండా కట్టడి మరింత కఠినం చేస్తామన్నారు.