న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? అన్న అనిశ్చితికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎఫ్టీపీ షెడ్యూల్, కొత్త చైర్మన్, ద్వైపాక్షిక సిరీస్ లపై నేడు ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కరోనా పెరిగిపోతుండటంతో ప్రపంచకప్ పై క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) సుముఖంగా లేకపోవడంతో.. టోర్నీ రద్దు దిశగానే వెళ్తోందని సమాచారం.అయితే ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని బీసీసీఐ కోరుకుంటోంది. ‘వరల్డ్ కప్ ఉంటుందా? లేదా? అన్నది త్వరగా తేల్చాలి.
దీనిపై వేచిచూసే ధోరణి అవసరం లేదు. మరింత కాలం వేచి చూస్తే ఇతర దేశాల షెడ్యూల్స్ కు ఆటంకం తలెత్తుంది’ అని కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ఈ ఏడాది టోర్నీని 2021కు మార్చాలన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి.ఒకవేళ టీ20 ప్రపంచకప్ జరగకపోతే ఆ విండోలో అన్ని దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే విధంగా ఎఫ్‌టీపీని రివైజ్ చేయాలని ఐసీసీ భావిస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం ఈ విండోలో ఐపీఎల్‌ను నిర్వహించాలని అనుకుంటోంది. ఐసీసీ కొత్త చైర్మన్‌కు సంబంధించిన ఎన్నికల కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది.