ఒకప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మల జుట్టు చాంతాడంత పొడవు ఉండేవి. వాళ్లకు ఏరోజూ జుట్టు రాలుతోందన్న టెన్షన్ ఉండేది కాదు. అవునా, దానికి కారణం వాళ్లు వాడే నూనెలు. ఇప్పుడు మార్కెట్లో దొరికే ప్రతి నూనెను వాడుతున్నా జుట్టు సమస్యలు తగ్గడం లేవు. అందుకే మళ్లీ పాతకాలంలో వాడే నూనెలనే ఉపయోగించి జుట్టు పొడవును పెంచుకోండి. ఎలాంటి నూనెలు వాడితే కురులు అందంగా పెరుగుతాయో తెలుసుకుందాం.
కొబ్బరి నూనె
అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు కోసం కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్. దెబ్బతిన్న జుట్టును ఆరోగ్యంగా మారుస్తూ, కుదుళ్ల నుంచి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే చుండ్రు, పేల సమస్యను అతి త్వరగా పోగొట్టే శక్తి ఈ నూనెకు ఉంది. రోజు విడిచిరోజు కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి జుట్టు, మాడుకు అప్లై చేయాలి. చేతి వేళ్లతో లైట్ గా మర్దనా చేయాలి. రెండు గంటల తర్వాత రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరి నూనె ఎక్కువ జిడ్డుగా ఉండదు కాబట్టి రాత్రిళ్లు పెట్టుకుని పడుకోవచ్చు. ఇందులో పోషకాలు జుట్టును ఒత్తుగానే కాదు, అందంగా మెరిసేలా చేస్తుంది.
ఆముదం
జుట్టు బాగా పొడవు పెరగాలనుకునేవారు ఆముదాన్ని రోజూవారీ రోటీన్లో చేర్చుకోవాల్సిందే. ఆముదంలో విటమిన్– ఇ, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రు, ఇతర స్కాల్ఫ్ సమస్యలను సమర్థంగా తగ్గిస్తాయి. ఆముదాన్ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. పొడవుగా ఎదుగుతుంది. మునివేళ్లతో ఆముదాన్ని మాడుకు రాసుకుని మర్దనా చేసుకోవాలి. ఆ తర్వాత వెంట్రుకలకు కూడా ఆముదాన్ని రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. వెంట్రుకలకు తగిన పోషణ అందుతుంది.
నువ్వుల నూనె
జుట్టు పొడవుగా, ఆరోగ్యంగా పెరిగేలా నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో సైతం ఈ నూనెకు ప్రత్యేకమైన ప్రాధాన్యముంది. దీనిలో స్కాల్ఫ్ పై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి ఈ నూనె రాసుకోవడం ద్వారా జుట్టు రాలడానికి కారణమవుతున్న చుండ్రు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. నువ్వుల నూనెను గోరువెచ్చగా వేడి చేసి తలకు రాసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందొచ్చు. ఈ నూనెలో ఉండే విటమిన్ – ఇ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఈ నూనెను రెగ్యులర్ గా వాడాలి.
ఆలివ్ నూనె
జుట్టు, స్కాల్ఫ్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జుట్టును పొడవుగా, బలంగా మారుస్తుంది ఆలివ్ నూనె. దీనిలో జుట్టు పోషణకు అవసరమైన విటమిన్ –ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ నూనె వెంట్రుకల్లోని తేమను బయటకు పోకుండా లాక్ చేస్తుంది. ఆలివ్ నూనెను కొద్దిగా వేడిచేసి తలకు అప్లై చేసుకోవాలి. ఆపైన వేడి నీటిలో ముంచి బాగా పిండిన టవల్ ను తలకు చుట్టుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. అయితే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్కెట్లో దొరికే ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం ఇంకా మంచిది.
లావెండర్ ఆయిల్
ప్రస్తుతం ప్రతి సూపర్ మార్కెట్ లేదా మెడికల్ షాపుల్లో ఈ లావెండర్ ఆయిల్ దొరుకుతోంది. జుట్టు రాలే సమస్యతో బాధపడేవాళ్లకు లావెండర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని అన్ని నూనెల్లా వాడలేం. కాబట్టి కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి, దాన్ని ప్రతిరోజూ తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే కొత్త జుట్టు రావడానికి తోడ్పడుతుంది.