Breaking News

గాజులదిన్నె.. గలగల

గాజులదిన్నె.. గలగల

  • ప్రాజెక్టుకు భారీగా వరద.. 4 గేట్లు ఎత్తివేత
  • నిండుకుండలా ఉన్న సంజీవయ్య సాగర్

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు సమీపంలోని గాజులదిన్నె సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హోలగుంద, ఆస్పరి, పత్తికొండ, ఆలూరు, తుగ్గలి ప్రాంతాల నుంచి వాగులు, వంకలు పొంగి వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. 60వేల క్యూసెక్కుల నీరు చేరడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ రవిప్రసాద్ ప్రాజెక్టు నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం గాజులదిన్నె ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల నీరు చేరిందని, ప్రస్తుతం 41వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో ఇన్ ఫ్లో నీటిని బట్టి ఇంకా విడుదల చేస్తామన్నారు. ఈ పరిస్థితుల్లో గాజులదిన్నె ప్రాజెక్టుకు దిగువన ఉన్న కైరవాడి, గాజులదిన్నె, పుట్టపాశం, తిప్పనూరు, వేముగోడు, వర్కుర్, కోడుమూరు నుంచి కర్నూలు వరకు హంద్రీనీవాకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో వీఆర్వోల ద్వారా ఉదయాన్నే డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. గాజులదిన్నె ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తున్నరన్న సమాచారం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సందర్శకులు ప్రాజెక్టు పరిసర అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్థానిక ఎస్సై హన్మంత్​రెడ్డి ఆధ్వర్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.