- రాష్ట్రంలో బుల్డోజర్ రాజకీయం
- ఇదొక దగుల్బాజీ ప్రభుత్వం
- రైతుభరోసా ఏది? నిరుద్యోగ భృతి ఎక్కడా?
- ఆరు గ్యారెంటీల అమలుపై సోయి ఎక్కడ?
- నాగర్ కర్నూల్ మాజీఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
సామాజికసారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో బుల్డోజర్ రాజకీయం నడుస్తోందని నాగర్ కర్నూల్ మాజీఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలుచేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని మండిపడ్డారు. మూసీ ఉన్న శ్రద్ధ రైతుబంధుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రూ.60వేల పెడుతున్న దాంట్లో రూ.2వేల కోట్లు రైతుభరోసాకు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు రైతుబంధు రాలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఆడ పడుచులకు పింఛన్లు పెంచలేదని, గ్యాస్ సిలిండర్ రాలేదని ఎద్దేవాచేశారు. వానాకాలం మొత్తం అయిపోయినా ఇంతవరకు మీరు చెప్పిన రైతు భరోసా రాలేదన్నారు. ఒక రైతు భరోసా ఎగ్గొట్టారని, రెండెకరాల ఇస్తవా? మూడెకరాలకు ఇస్తవా? ఐదెకరాలకు ఇస్తవా? అసలు ఇస్తవా? ఇయ్యవా? ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. కృష్ణానదిలో పుష్కలంగా నీళ్లున్నా ఇంతవరకు కాల్వలకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలమంతా కాల్వల వెంట తిరిగి నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చూశామన్నారు. తెలంగాణ, ఏపీలో గురుశిష్యుల పాలన కొనసాగుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్లేనని అన్నారు. ఇక్కడ చేతకాని దద్దమ్మ మంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇంత దగుల్బాజీ ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. తాము క్రమశిక్షణ నేర్పించే నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద దాడుల చేయించడం సబబుకాదన్నారు. పోలీసులు, అధికారులు తమ ఓపిక, సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, పులెందర్ రెడ్డి, అర్థం రవి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.