సారథి న్యూస్, శ్రీకాకుళం : దేశ, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్, కరోనాపై తీసుకుంటున్న చర్యలపై మీడియాకు వివరించారు.
జిల్లాకు ఇప్పటివరకు విదేశాల నుండి 13,500 మంది వరకు వచ్చారని, వారు స్వచ్ఛందంగా సెల్ నం.94912 22122, 089422 40699 లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పరీక్షించిన అనంతరం రెండవ దశలో విదేశాల నుంచి వచ్చిన వారందరి నమూనాలు సేకరించి పరీక్షిస్తామని తెలిపారు.
కరోనా లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్ కేసులు గుర్తించగలగుతున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావొద్దని, వైద్య సేవలు అందించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని భరోసానిచ్చారు. పాతపట్నం మండలంలోని 18 పంచాయతీల్లో 27 ఆవాసాలను రెడ్ జోన్ గా ప్రకటించామని చెప్పారు. అక్కడ అణువణువునా గాలిస్తున్నామని, ప్రతి ఒక్కరి నమూనాలు సేకరించి రాపిడ్ కిట్లతో పరీక్షిస్తున్నామని చెప్పారు.
రెండు రోజుల్లో జిల్లాలో వీఆల్ డీ పరీక్షల కేంద్రం ఏర్పాటు కానుందని, తద్వారా రోజుకు వెయ్యి నమూనా పరీక్షలు చేయగలమని తెలిపారు. కంటైన్ మెంట్ జోన్ లో తాగునీరు, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చి వారి వివరాలు గోప్యంగా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.