సారథి న్యూస్, నర్సాపూర్: జన్మనిచ్చిన పాపానికి ఓ తల్లిపాలిట కన్నకొడుకే కాలయముడిగా మారాడు. కన్నతల్లి అని కూడా చూడకుండా గొడ్డలితో అతిదారుణంగా హతమార్చాడు. ఈ హృదయ విదారకర సంఘటన బుధవారం మెదక్జిల్లా హత్నూర పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్ ఖాన్ పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. షేర్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన కోటగళ్ల నర్సమ్మ(65)కు నలుగురు కొడుకులు ఉన్నారు. చిన్నకొడుకు నర్సింలు అలియాస్ నర్సింగరావు కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు ఊరుకు వచ్చిపోతుండేవాడు. కుటుంబ ఆస్తి గొడవ విషయమై పలుమార్లు గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి అందరికీ నచ్చజెప్పారు.
‘ఎన్నటికైనా నిన్ను చంపుతానని’ చిన్నకొడుకు నర్సింలు తన తల్లిని బెదిరించేవాడు. పథకం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న తల్లి నర్సమ్మను గొడ్డలితో నరికి అతికిరాతకంగా నరికి చంపాడు. తెల్లవారుజామున కొడుకులు, ఇరుగుపొరుగు వారు చూసే సరికి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. డీఎస్పీ శ్రీధర్, సీఐ లాలూ నాయక్, ఎస్సై శ్రీనివాస్ సంఘటనస్థలాన్ని పరిశీలించారు. మృతురాలి మూడో కొడుకు కోటగళ్ల సంజీవ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.