అందరిలా సాధారణంగా జీవిస్తే అందులో ప్రత్యేకత ఏముంటుంది. భిన్నంగా ఏదైనా చేస్తేనే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు దక్కుతాయి. అంతకు మించి ఆత్మ సంతృప్తి దొరుకుంది. అచ్చం అలాగే ఆలోచించారు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ మధుసూదన్.
సారథి న్యూస్, మెదక్: సాధారణంగా టీచర్ల వద్ద పుస్తకాలు ఉంటాయి. కానీ ఆయన వద్ద మాత్రం దేశవిదేశాలకు చెందిన వందల ఏళ్ల నాటి స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్లు ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల క్రితం హాబీగా మొదలుపెట్టి ఆయన తనకు 80 ఏళ్లు దాటినా తన హాబీని విడిచిపెట్టలేదు. 130 దేశాల నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపులు, పోస్టు కార్డులను సేకరించారు. వీటితో పాటు దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖ సంతకాలను సైతం సేకరించారు. కౌచిప్ప(కసికె)లపై మహాత్మాగాంధీ, తెలంగాణ తోరణం, అశోకచక్రం తదితర బొమ్మలను ఎన్నింటినో అందంగా చిత్రీకరించారు. వాటిని పలు ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచి పలువురి చేత మన్ననలు పొందారు.
టీచర్‌గా ఉద్యోగం
మధుసూదన్ కు 1960లో టీచర్ఉద్యోగం వచ్చింది. కాగా, ఆయన 1997లో ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచే దేశ, విదేశాల నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపుల సేకరణ ప్రారంభించారు.
ఉద్యోగం ప్రారంభంలో జహీరాబాద్‌లో టీచర్ల మీటింగ్‌కు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వద్ద పురాతన నాణెం కనిపించగా, అతని నుంచి తీసుకున్నారు. నాటి నుంచి వివిధ దేశాలకు చెందిన కాయిన్స్, నోట్లు సేకరణే హాబీగా పెట్టుకున్నారు. అలాగే గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడ దొరికే ఇతర దేశాలకు చెందిన కరెన్సీ సేకరించారు.
విద్యార్థులకు అవగాహన
మధుసూదన్సేకరించిన నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపులను తీసుకొచ్చి ప్రతిరోజు విద్యార్థులకు ఇండియాతో పాటు దేశ, విదేశాల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత.. వాటి ప్రాముఖ్యం తదితర వాటి గురించి వారికి వివరించేవారు.
దేశ, విదేశాల నుంచి..
రిటైర్డ్టీచర్మధుసూదన్ఇప్పటి వరకు 130 దేశాల నాణేలు, కరెన్సీ నోట్లు సేకరించారు. ఇందులో క్రీస్తుశకం 1195–1895 మొఘల్‌కాలం నాటి నాణేలు ఉండడం విశేషం. అలాగే 1866 నుంచి ఇండియా కరెన్సీ, వీటితో పాటు కతార్, స్పెయిన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కరెన్సీ నోట్లను సేకరించారు. ఇందులో ఇండియాలో శ్రీరాముడి కాలం నాటి నాణెంతో పాటు అణా పైసా నుంచి ఇప్పటి రూ.రెండువేల నోటు వరకు ఉన్నాయి. ప్రపంచంలోని 150 దేశాలకు చెందిన వివిధ రకాల స్టాంపులు, పోస్టు కార్డులను ఆయన సేకరించారు. 1870 కాలం నుంచి ప్రవేశపెట్టిన స్టాంపులు అతని వద్ద ఉన్నాయి.
సరదాగా.. అభిరుచిగా
పూర్వకాలం నాటి, విదేశాల కరెన్సీ, నాణాల సేకరణ సరదాగా మొదలై అభిరుచిగా మారింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన నేను వీటి ద్వారా విద్యార్థులకు ఎన్నో విషయాలు చెప్పాను. ఆయా దేశాల కరెన్సీ ఎలా ఉంటుంది? ఏమని పిలుస్తారు? నాగరికత, సంస్కృతి గురించి అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాను.
:: మధుసూదన్, రిటైర్డ్ టీచర్, రామాయంపేట,