- శ్రీశైలం పవర్‌హౌస్ ఘటన చాలా దురదృష్టకరం
- బాధిత కుటుంబాలకు అన్నివిధాలుగా సాయం
- విచారం వ్యక్తంచేసిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన సంఘటన దురదృష్టకరమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే అర్ధరాత్రి బయలుదేరి సంఘటన స్థలికి 2.30 గంటలకు చేరుకున్నా ఉద్యోగులను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం జెన్కో పవర్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన జెన్కో ఉద్యోగుల పార్థివదేహాలను ఆయన శుక్రవారం సాయంత్రం దోమలపెంటలో సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రాణాలను కాపాడేందుకు స్వయంగా తనతో పాటు రెస్క్యూ టీంలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం తనను కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మృతిచెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా వారికి ఒక్కొక్కరికి రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు సీఎం కేసీఆర్అంగీకరించారని తెలిపారు. ఈ ఘటనపై సీబీసీఐడి విచారణకు ఆదేశించారని వెల్లడించారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎంపీ రాములు
‘శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరం. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరం. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా.. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..’ అని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు అన్నారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్గువ్వల బాలరాజు, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు పి.భరత్ తదితరులు ఉన్నారు.