సారథి న్యూస్, మిడ్జిల్: సాధారణంగా అన్ని గ్రామాల మాదిరిగానే ఆ ఊరులోనూ ఎక్కువగా వలస వెళ్లి బతికే కూలీలు, కార్మికులు ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడెక్కడ ఉన్నవారంతా తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఏ ఇల్లూ చూసినా ఇంటిల్లిపాదితో కళకళలాడుతోంది. ఆ గ్రామంలో ఏ పండుగనైనా కలిసిమెలిసే జరుపుకుంటారు. అయితే గ్రామస్తులంతా పెద్దఎత్తున జరుపుకునే వేడుకల్లో పీర్ల పండగ ఒకటి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొహర్రం తర్వాత ఈ గ్రామంలో నిశ్శబ్దం ఆవహించింది. కారణం ఏమిటంటే కరోనా మహమ్మారి ఆ ఊరువాసులను కలవరపెడుతోంది.
మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో పీర్ల పండుగ అయిపోయిన మరుసటి రోజు ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా, ఆ తర్వాత నాలుగు కేసులు, ఆ మరుసటి రోజు మరో రెండు.. మూడు రోజుల వ్యవధిలోనే ఏడు కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామం గ్రామస్తులను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇంకెంత మందికి కరోనా మహమ్మారి అంటుకుందోనని అందరిలోనూ భయం మొదలైంది.. అయితే ఎక్కడో చిన్న పొరపాటు, నిర్లక్ష్యం జరిగిందని మాత్రం ఊరంతా భావిస్తున్నారు. ఇటీవల పీర్ల పండగ ఉత్సవాల్లో భౌతిక దూరం పాటించకుండా తిరగడం, అలవ్ వద్ద చిన్నాపెద్ద లేకుండా ఆడడం, చాలా మాస్కులు కట్టుకోకపోవడం, మహిళలు బతుకమ్మ ఆటలు ఆడడం.. కారణమై ఉండొచ్చని ఎవరికివారు భావిస్తున్నారు. మాస్కు కట్టుకొమ్మని ఎంతచెప్పినా కొంతమంది పట్టించుకోకపోవడంతోనే ఊరులో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు పెదవివిరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు హెచ్చరిస్తున్నారు.