Breaking News

అరచేతిలో లైబ్రరీ

  • ఒక క్లిక్​తో కోటి బుక్స్​
  • కేజీ టు పీజీ బుక్స్​ ఒకేచోట
  • హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ ప్లాన్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​కు ప్రిపేరయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే స్టూడెంట్స్​ అయినా.. ఫలానా బుక్​ దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే ఒక బుక్​ ఉంటే దానిని మరొకరికి ఇచ్చేశారు.. తానెలా చదువుకునేది? అన్న దిగులొద్దు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, స్టేట్​ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన ఎన్నో రిఫరెన్స్​ బుక్స్​ ఎలా కొనాలనే ఆలోచనా వద్దు. ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి. కేజీ నుంచి పీజీ వరకు అన్ని రిఫరెన్స్​ బుక్స్​ అన్ని నెట్టింటిలో దొరుకుతున్నాయి. కావాల్సిన బుక్స్​ను ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. వెబ్‌సైట్‌ నుంచి పీడీఎఫ్​ ఫైల్​ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన వీడియోలు చూడొచ్చు. ఆడియోలు వినొచ్చు. అందుకు కావాల్సిందల్లా ఇంటర్​నెట్​ సదుపాయమే. ఒకటి కాదు.. రెండు కాదు.. కోటికిపైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు చదువుకోవచ్చు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ భారీ కసరత్తును చేసింది. https://ndl.iitkgp.ac.in ఈ లింక్​ను క్లిక్‌ చేసి అవసరమైన బుక్స్​ను చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) బుక్స్​ను కంప్యూటరైజ్డ్​ చేసి ఇందులో పొందుపరిచారు. త్వరలోనే మెుబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

డిజిటల్‌ లైబ్రరీ ప్రత్యేకతలు
– 70కి పైగా భాషల్లో.. కోటికిపైగా ఈ–బుక్స్​
– 2లక్షల మంది ప్రముఖుల మూడులక్షల ఆర్టికల్స్‌
– లక్ష మంది భారతీయ స్టూడెంట్స్​ థీసిస్‌లు
– రైటింగ్​ పేపర్లు, పలు భాషల్లో ఆడియో లెక్చర్లు
–18వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు
– 33వేలకు పైగా గత క్వశ్చన్​ పేపర్లు
– యూనివర్సిటీలు, స్కూలు బోర్డుల క్వశ్చన్​ పేపర్లు, ఆన్సర్​ షీట్లు
– అగ్రికల్చర్​, సైన్స్, టెక్నాలజీ రంగాల సమాచారం.
– సమాచార నిధి, వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు
– సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు

రిజిస్ట్రేషన్‌ ఈజీ
డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా ఈజీ. ఈ–మెయిల్‌ ఐడీ, తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదుచేసిన తర్వాత తాము పేర్కొన్న ఈ–మెయిల్‌ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ–మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదుచేసి లైబ్రరీలో లాగిన్‌ కావచ్చు. స్టూడెంట్స్​, అభ్యర్థులు తమకు అవసరమైన విభాగాల వారీగా పుస్తకాలు, వీడియో, ఆడియో పాఠాలు, లెక్చర్లు, ఉపన్యాసాలు వెతికి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​కు ప్రిపేరయ్యే స్టూడెంట్స్​కు ఈ డిజిటల్‌ లైబ్రరీతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వాటిని ఎలా పరిష్కరించారో తెలుసుకోవచ్చు. అయితే వాటికి సంబంధించి మార్కెట్‌లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో వాటిని పొందవచ్చు.