- నాగర్ కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ పద్మావతి
సారథి న్యూస్, నాగర్కర్నూల్: ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని నాగర్ కర్నూల్ జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అధికారులకు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని డీకేఆర్ ఫంక్షన్ హాల్ లో జడ్పీ జనరల్ బాడీ మీటింగ్లో ఆమె మాట్లాడారు. త్వరలోనే జడ్పీ ఆఫీసు పనులు పూర్తయి ప్రారంభించుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఈ.శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు కేవలం రెండు కేసులు మాత్రమే పాజిటివ్ వచ్చాయని, ఇటీవల వచ్చిన మరో రెండు కేసులు జిల్లావాసులు హైదరాబాద్లో సెటిలైన వారేనని వివరించారు.
కరోనా, లాక్ డైన్ నేపథ్యంలో సుమారు 36వేల మంది వలస కూలీలు బయటి నుంచి జిల్లాకు వచ్చారని వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వలస కూలీలు వస్తే వారికి అన్నిరకాల సదుపాయాలు కల్పించాలని ఎంపీ రాములు కోరారు. డీఏవో సింగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత వ్యవసాయ విధానంలో 5,62,299 ఎకరాల్లో సాగు అంచనా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. పంచాయతీలు కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లు నాసిరకంగా ఉన్నాయని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి, జడ్పీ సీఈవో నాగమణి, డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ లాల్ పాల్గొన్నారు.