- వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవం
- పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు
సారథి న్యూస్, పాపన్నపేట: మహాశివరాత్రి పర్వదినం రోజున పవిత్ర మంజీరా నది పాయల మధ్య వనదుర్గామాత సన్నిధిలో ఏడుపాయల జాతర గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఓ వైపు శివనామస్మరణ, మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజామున పూజారులు అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, అర్చనలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, కలెక్టర్ హరీశ్‌తో కలిసి వన దుర్గా మాత కు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం మంజీరా నది పాయ మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తూ జాతరను ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. మున్ముందు ఏడుపాయల మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.