- కరోనా ప్రభావమే కారణం
- అవసరాన్ని సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు
సారథి, రాయికల్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. కొందరు వైరస్ బారినపడి మృత్యువాతపడగా మరికొందరు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు.
ఈ సమయంలో వైద్యులు, నిపుణులు పండ్లను అధికంగా తినడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. తద్వారా వైరస్ నశించిపోతుందని చెబుతున్నారు. వ్యాధి బారినపడిన పేదలు త్వరగా కోలుకోవాలనే తపనతో పండ్లను కొని తిందామంటే వాటి ధరలకు రెక్కలు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితుల్లో పండ్లను కొనుగోలుచేసి తినే పరిస్థితి లేదని బాధపడుతున్నారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన కొందరు పండ్ల వ్యాపారులు రేట్లు పెంచారని వాపోతున్నారు. ఒక కిలో సంత్రాలు(బత్తాయిలు) రూ.200 నుంచి 220, దానిమ్మ కిలో ధర రూ.240, కివి పండ్లు కిలో రూ.180 నుంచి 200, డజను అరటి పండ్లు రూ.40 నుంచి రూ.60 వరకు ధరలు పలుకుతుండటంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. పండ్లను కొందామంటే డబ్బులు సరిపడక.. తినకపోతే శరీరంలో ఇమ్యూనిటీ శక్తి పెరగకప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని కొందరు బాధపడుతున్నారు. పండ్ల ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.