Breaking News

పాలమూరుకు డీపీఆర్ ఏది?

– కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు లేదు
– ఆర్డీఎస్‌ విషయంలో హామీ ఏమైంది
– కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌

సామాజికసారథి, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో అత్యంత అవినీతిపాలన నడుస్తోందని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా డిమాండ్‌ చేస్తున్న కేసీఆర్‌ ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి డీపీఆర్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా జాతీయహోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చి మరిచిపోయిన హామీలను గుర్తుచేసేందుకే బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారని ప్రహ్లాద్‌ సింగ్‌ స్పష్టంచేశారు. ఆర్డీఎస్‌ విషయంలో కేసీఆర్‌ సర్కారు ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని అన్నారని గుర్తుచేశారు. కాళేశ్వరంపై ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజెక్టులపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజాసంగ్రామయాత్ర కొనసాగింది. మల్దకల్‌ నుంచి ప్రారంభమైన యాత్ర సద్దలోనిపల్లి మీదుగా అమరవాయికి చేరింది. అమరవాయి గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. కొండపల్లి క్రాస్​రోడ్డు కాటన్ మిల్స్ వద్ద గ్రామస్తులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాదయాత్రలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పాల్గొన్నారు. మాజీమంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​యాత్రలో నడిచారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, కానీ పాలమూరు ప్రాంతానికి సీఎం కేసీఆర్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 299 టీఎంసీల నీటి వాటాకు ఒప్పుకొన్నది కేసీఆర్‌ అని.. కానీ రావాల్సిన నీటివాటాను తెచ్చుకునేందుకు బీజేపీ సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అందులో భాగంగానే మూడు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయించామన్నారు. నీళ్లు, నిధులు, నియామకం సవాల్​గానే మిగిలిందన్నారు. తెలంగాణ ప్రజలు అధికార మార్పిడి కోసం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

టీఆర్ఎస్​నాయకుల అరాచకాలు
అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. కానీ అందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటివరకు కేంద్రానికి సమర్పించలేదు. ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని ఓ వైపు డిమాండ్‌ చేస్తూనే.. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసును విరమించుకుంటే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పడంతో కేసును విరమించుకున్నారు. కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గోదావరి నుంచి 200 కి.మీ.దూరం.. రూ.లక్షా 20వేల కోట్లు పెట్టి కాళేశ్వరం పూర్తిచేసుకుని కేసీఆర్‌ ఫాం హౌస్‌కు నీళ్లు తెప్పించుకున్నారని గుర్తుచేశారు. అదే రూ.రెండువేల కోట్లు కేటాయిస్తే పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని తెలిపారు. కమీషన్లు రావడం లేదని కేటాయించడం లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారని.. కేంద్రం నుంచి నిధులు పంపిస్తున్నా.. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేందుకే ప్రధాని మోడీ.. కేంద్రమంత్రిని ఇక్కడికి పంపించారని వివరించారు. అంతకుముందు మంగపేట శివారులో పొలాల్లో పని చేస్తున్న కూలీలతో కేంద్రమంత్రి ముచ్చటించారు. ఖమ్మంలో టీఆర్ఎస్​నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్త సాయిగణేశ్​పోరాటం చేశారని గుర్తుచేశారు. పోలీసుల వేధింపులు తాళలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సాయిగణేశ్ వాంగ్మూలాన్ని పోలీసులు ఎందుకు తీసుకోలేదని సంజయ్‌ ప్రశ్నించారు. అతనిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యేనని.. పోలీసులు ప్రణాళిక ప్రకారమే చేశారన్నారు. రామాయంపేటకు చెందిన తల్లీకుమారుడి ఆత్మాహుతి, కోదాడ అత్యాచార ఘటన, వామనరావు దంపతుల హత్య వెనుక ఉన్నది టీఆర్ఎస్​నాయకులేనని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనలపై సీఎం కేసీఆర్‌ సీబీఐ విచారణ కోరాలని, ఆయనే బయటకు వచ్చి వీటిని ఖండించాలని డిమాండ్‌ చేశారు.