- జీవోనం.317 జీవో సవరించాల్సిందే..
- ఉద్యోగ సంఘాలు మానం వీడి బయటకు రావాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సామాజికసారథి, కరీంనగర్: ఉద్యోగులకు గుదిబండగా మారిన 317 జీవో సవరించే వరకు పోరాడతామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. గురువారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వీడి ఉద్యోగులకు అండగా నిలవాలని సూచించారు. 317 జీవోను సవరించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు సీఎం సోయిలోకి రావాలని మేం దీక్ష చేస్తుంటే మీరు గునపాలు పెట్టి గేట్లు బద్ధలు కొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, దీనివల్ల నువ్వు సాధించింది ఏంటని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన దారుణ కాండపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. ఈ ఘటనను గురించి తెలసుకునేందుకు ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం రమణ్‌సింగ్ ఇక్కడకు వచ్చారన్నారు. డాక్టర్ కె.లక్ష్మణ్ ను రాత్రి 9 గంటలకు అరెస్టు చేసి తెల్లవార్లు చలిలో ఉంచడం ప్రభుత్వ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బండి అన్నారు. తెలంగాణలో రాక్షస, నియంత, గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామన్నారు. ముఖ్యంగా కేసీఆర్జైలుకు వెళ్లాలని జనం కోరుకుంటున్నారని ఆయన జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు. బీజేపీ నేత కే లక్ష్మణ్ మాట్లాడుతూ 317కు వ్యతిరేకం సాగుతున్న ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తామన్నారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పోరాడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మేం చేస్తున్న ప్రయత్నాలకు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తుందని ఆయన వివరించారు.