సారథి, ములుగు: ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తాము పండించిన పంటను అమ్మడంలో ఇబ్బందిపడకూడదని ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్వోఎఫ్ఆర్ లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ములుగు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు.
గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి రవాణా సదుపాయాల పరంగా లోటు లేకుండా, గోనె సంచుల కొరత లేకుండా చూడాలన్నారు. అలాగే గోదాముల సామర్థ్యం, పంట దిగుబడికి తగ్గట్లుగా ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా, తేమ శాతం 17 మించకుండా ఉండేలా చూసుకోవాలని కోరారు. ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ(సీతక్క) మాట్లాడుతూ.. జిల్లాలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి రూ.55 కోట్లు కేటాయించడంతో హర్షం వ్యక్తంచేశారు. ములుగు జిల్లాను టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని కోరారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.