- ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలి
- పరీక్షలు, ఆక్సిజన్బెడ్ల సంఖ్యను పెంచాలి
- దివ్యాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రం హోం
- ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశయ్యారు. యుద్ధ ప్రాతిపదికన వయోజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సపై శాస్త్రీయ పరిశోధన మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, ఏవియేషన్, హోం, కేబినెట్ సెక్రటరీలు, రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు ఇతర మంత్రిత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, కొవిడ్‌పై డిసెంబర్ 24న ప్రధాని నరేంద్రమోడీ సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం, ఒమిక్రాన్ కేసులు, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలోనే ముఖ్యమంత్రులతో కరోనాపై సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ పరీక్ష కేంద్రాలు, ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లను పెంచాలని పేర్కొన్నారు.
మారుమూల ప్రాంతాలకు టెలిమెడిసిన్
మారుమూల ప్రాంతాలకు టెలిమెడిసిన్ అందుబాటులో ఉంచాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదేశించారు. రాష్ట్రాలలో పాటిస్తున్న ఉత్తమ పద్ధతులపై త్వరలోనే ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలంతా కొవిడ్నియమాలను కచ్చితంగా పాటించాల్సిందేనని సూచించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దివ్యాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు ఇస్తున్నట్లు వెల్లడించింది. అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ జాబితా నుంచి తొలగించాకే కార్యాలయానికి రావాలని సూచించింది.
రికార్డు స్థాయిలో కరోనా కేసులు
గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1,59,632 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత 224 రోజుల్లో ఇవే అత్యధిక రోజువారీ కేసులు. చివరిసారి గతేడాది మే నెలలో ఒక్కరోజే 1,65,553 కేసులు వెలుగు చూశాయి. దీంతో యాక్టివ్ కేసులు 5,90,611కు చేరాయి. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3,623కు చేరింది. ఇప్పటివరకు 27 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకూ ఒమిక్రాన్ వ్యాపించింది.