Breaking News

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అపరిశుభ్రంగా పరిసరాలు

#జిల్లా ఆస్పత్రిని అకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
#సానిటరీ సూపర్వైజర్ ను సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశం

నాగర్ కర్నూల్, సామాజికసారథి: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే కుచూకుల్ల రాజేష్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలు చెత్త చెదారాలతో, మెడికల్ వ్యర్థాలతో అపరిశుభ్రంగా ఉండడాన్ని ఎమ్మెల్యే గమనించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఇంత నిర్లక్ష్యం ఏంటనీ ఆసుపత్రి అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు.

ఆసుపత్రి పరిశుభ్రతను చూసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటున్న సానిటరీ సూపర్వైజర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి కేవలం నిరుపేద కుటుంభాల ప్రజలు వైద్యం కోసం వస్తుంటారని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన భాధ్యత జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులపై ఉందన్నారు. వివిధ రోగాలతో ఆసుపత్రి కి వస్తే ఇక్కడ కొత్త రోగాలు వచ్చేలా పరిసరాలు ఉండడం తగదన్నారు. ఆసుపత్రి పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉంచేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రోగులను ఇక్కడి సిబ్బంది ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. కాన్పులు, ఇతర వైద్య సేవలకు ఆస్పత్రి కింది స్థాయి సిబ్బంది రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఎట్టి పరిస్థితుల్లో రోగుల నుంచి డబ్బులు వసూలు చేయ వద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామినిచ్చారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.