సామాజిక సారథి, హైదరాబాద్: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు. అనంతరం మరో ఇద్దరు కూలీలు లోపలికి దిగారు. అయితే వారు ఎంత సేపటికీ బయటకి రాలేదు. దీంతో మిగతా ఇద్దరు వారికి ఏం జరిగిందోనని లోపలికి దిగి చూడగా ఆ ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. మృతులను నల్గొండ జిల్లా దేవరకొండ మండటం గాజీనగర్ వాసులుగా గుర్తించారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటంబసభ్యులు అపార్ట్మెంట్ ఎదుట డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.