Breaking News

మరో రెండు కరోనా వ్యాక్సిన్లు

  • December 29, 2021
  • Archive
  • Comments Off on మరో రెండు కరోనా వ్యాక్సిన్లు
మరో రెండు కరోనా వ్యాక్సిన్లు
  • తయారీ సంస్థలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
  • కేంద్రమంత్రి మాన్సూఖ్‌ మాండవీయ ట్వీట్‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ 19 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింద. దీనికి జనవరి 1 నుంచి కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా కట్టడికి మరో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం దేశీయంగా సీరం సంస్థకు చెందిన కోవిషీల్డు, భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్​వినియోగంలో ఉన్నాయి. వాటితోపాటు రష్యాకు చెందిన స్పూత్నిక్‌ వ్యాక్సిన్‌ కూడా ఇస్తున్నారు. తాజాగా దేశంలో మరో రెండు వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్య మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవియా ట్విట్‌ ద్వారా వెల్లడించారు. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన ‘కొవొవాక్స్‌’, హైదరాబాద్‌ కంపెనీ బయోలాజికల్‌ ఈ తయారు చేసిన ‘కార్బెవాక్స్‌’కు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సీరం సంస్థ అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి కోవోవాక్స్‌ అనుమతి కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు అక్టోబర్‌లోనే దరఖాస్తు చేసింది. ఈ టీకాపై చేపట్టిన రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను కంపెనీ సమర్పించింది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి వ్యాక్సిన్‌ సాంకేతికతను పొందిన సీరం ‘కొవొవాక్స్‌’ టీకాను ఉత్పత్తి చేసింది. దీనిపై సమీక్ష నిర్వహించిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ(ఎస్‌ఈసీ) అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌తో దేశీయంగా మూడు కొవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు.