- ప్రముఖులకు శిల్పాచౌదరి వల
- రూ.కోట్లలో దండుకుని మోసం
- ఫిర్యాదులతో అరెస్ట్ చేసిన పోలీసులు
సామాజిక సారథి, హైదరాబాద్: పార్టీల పేరుతో టాలీవుడ్ హీరోలు, ప్రముఖులను వలలో వేసుకుని కోట్ల రూపాయలను దండుకున్న వ్యాపారవేత్త, సినీనిర్మాత శిల్పాచౌదరీని శనివారం పోలీసులు అరెస్ట్‌చేశారు. నార్సింగ్ మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లాలో నివాసం ఉంటున్న చౌదరి గత కొన్నాళ్లుగా గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీహిల్స్, విజయవాడ, కర్నూలు, ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసింది. వారితో పరిచయం ఏర్పాటు చేసుకుంది. తాను సినీ ఫీల్డ్‌లో ప్రొడ్యూసర్ నంటూ నమ్మబలికింది. వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.కోటి నుంచి రూ.ఐదుకోట్ల వరకు డబ్బులు తీసుకొని కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతోంది. శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించిన బాధితురాలు రోహిణి తాను రూ.నాలుగు కోట్లు ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు బాధితురాలు రోహిణి తెలిపారు. తనతో పాటు అనేక మంది వద్ద దాదాపు వందకోట్లపై చిలుకు డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీసులు గండిపేట లోని సిగ్నేచర్ అపార్ట్‌మెంట్ కు వెళ్లి శిల్పాను అరెస్ట్‌చేశారు. చీటింగ్ కేసులో విచారణ జరుపుతున్నామని ఇన్స్పెక్టర్శివకుమార్ తెలిపారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బాధితులు తరలివస్తున్నారని వారి వద్ద నుంచి వివరాలు సేకరించి మరింత సమాచారాన్ని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.