సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ట్రబుల్ షూటర్, మంత్రి టి.హరీశ్‌రావు దీన్ని ఒక సవాల్‌గా తీసుకుని పనిచేశారు. అయినా ఫలితం తారుమారు కావడంతో వారు కొంత నైరాశ్యానికి గురైనట్లు తెలిసింది. అందులోనూ 23వేల పైచిలుకు మెజారిటీతో ఈటల రాజేందర్ గెలవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీకి చెందిన 30 మంది ముఖ్యనేతలతో సమావేశమైనట్లు వినికిడి. హుజూరాబాద్ పోరులో అన్నీతానై రథాన్ని ముందుకు నడిపిన మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో భేటీ అయ్యారు. ఆయన దాదాపు గంటసేపు చర్చించారు. ఆ తర్వాత ముఖ్యనేతలను పిలిపించుకుని ముఖ్యమంత్రి మాట్లాడినట్లు సమాచారం. ఉపఎన్నిక ప్రభావం పార్టీపై కచ్చితంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరిపైనా దృష్టి సారించాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ వల వేసే చాన్స్?
ఉపఎన్నిక ఫలితాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు వల వేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అందువల్ల ఆత్మగౌరవం, సెంటిమెంట్‌ను ఎక్కువగా చూపించే నేతలపై నిఘా ఉంచాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. అలాంటి వారిలో కొందరు మంత్రులు, కీలక నేతలు కూడా ఉండే అవకాశం లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఇప్పటి నుంచే పార్టీ నేతల కదలికల పట్ల ఓ కన్నేసి ఉండాలంటూ ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాన్ని మరిచిపోయి ఈనెల 29న వరంగల్‌లో నిర్వహించతలపెట్టిన విజయగర్జన సభపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.
మార్పు మొదలైందా..?
మరోవైపు హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ అగ్రనేతలతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతలో కొంత మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధపడుతున్న మంత్రి వి.శ్రీనివాసగౌడ్‌ను బుధవారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సీనియర్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు మహబూబ్‌నగర్ వెళ్లి పరామర్శించారు. ఇప్పటిదాకా వరి వేస్తే కొనేదిలేదంటూ ప్రభుత్వం, మంత్రులు హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో అందుకు భిన్నంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ వరి వేయొద్దంటూ మేం రైతులను ఎక్కడా ఒత్తిడి చేయడం లేదు.. కేవలం వారిని బతిమాలుకుంటున్నామని వ్యాఖ్యానించడం మార్పునకు సంకేతంగా భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.