- మనస్తాపంతో ఉపాధ్యాయిని ఆత్మహత్య
- ఇటీవలే ఆమెకు ట్రాన్స్ఫర్
సామాజికసారథి, నిజామాబాద్: ప్రభుత్వం చేసిన బదిలీలు ఉద్యోగుల గుండెలపై కుంపటిగా మారాయి. మనస్తాపానికి గురై ఆదివారం మరో ఉపాధ్యాయిని సూసైడ్ చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం.. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ కు చెందిన బేతల సరస్వతి (36) ప్రస్తుతం తమకు పక్కనే ఉన్న రెహత్‌నగర్ ప్రభుత్వ స్కూలులో టీచర్‌గా పనిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, కేటాయింపుల్లో భాగంగా ఆమెను ఇటీవల కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంటతండాకు ట్రాన్స్ఫర్చేశారు. కుటుంబాన్ని వదిలి అక్కడికి వెళ్లి విధులు నిర్వహించలేక కొన్నిరోజులుగా ఆందోళనకు గురవుతోంది. ఈ క్రమంలో సరస్వతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆమెకు భర్త, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయిని ఆత్మహత్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణాలు తీస్తున్న జీవోను వెనక్కి తీసుకోవాలి
జీవో నం.317కు మరో ప్రభుత్వ ఉద్యోగి ఉసురు తీసిందన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో బేతల సరస్వతి(36) అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. టీచర్ కు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని, వారి పరిస్థితిని తలుచుకుంటే వేదనతో పాటు ఆగ్రహం కలుగుతోందన్నారు. సరైన సంప్రదింపులు చేయకుండా, విధి విధానాలు తెలుపకుండా ప్రభుత్వం ఉద్యోగులను అయోమయంలో పడేసిందన్నారు. ఉపాధ్యాయుల ఉసురు తీస్తున్న జీవో 317ను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. జీవో వెనక్కి తీసుకొని, సవరణలు చేపట్టకపోతే ఉద్యోగుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులెవరూ మనోబలం కోల్పోకూడదన్నారు.
317 జీవో మరణశాసన: టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి
సామాజికసారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ప్రాణాలు తీసే ప్రభుత్వమని, దానికి తాజా ఉదంతం బీంగల్ మండలం, బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య చేసుకోవడమేనన్నారు. అడ్డగోలు బదిలీతో మనస్తాపం చెంది సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో విడుదలైన దగ్గర నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగి, బలవన్మరణానికి పాల్పడుతూ ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు. ఉద్యోగుల కేటాయింపు, బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉందని చెప్పారు. ఈ చావులకు ప్రభుత్వమే కాదు.. వారికి వత్తాసు పలికే ఉద్యోగసంఘాలు కూడా బాధ్యులేనని తెలిపారు. 317 జీవో రద్దు కోసం ప్రభుత్వంపై పోరాడుదామని, ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దని టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ, ఉద్యోగులను కోరారు.