Breaking News

పోతేపల్లి.. గుండెలవిసేలా తల్లడిల్లి

పోతేపల్లి.. గుండెలవిసేలా తల్లడిల్లి

  • రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం.. గ్రామానికి మృతదేహాలు
  • మృతుల కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి

సామాజికసారథి, వెల్దండ: ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద జరిగిన యాక్సిడెంట్​ లో అక్కడికక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. బైకాని యాదయ్య(35), హెచ్.​కేశవులు (35), మోత శ్రీను(30) మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి శనివారం తీసుకొచ్చారు. ఇమ్మరాజు రామస్వామి(36) మృతదేహాన్ని లింగారెడ్డిపల్లికి తరలించారు. నలుగురి డెడ్​ బాడీస్​ ఒకేసారి గ్రామానికి రావడంతో ఒక్కసారిగా తీవ్రవిషాదం నెలకొన్నది. ఎవరిని కదిలించినా కళ్లల్లో నీళ్లే కనిపించాయి. శుభకార్యాల్లో వంటలు చేస్తూ అందరితోనూ బాగుండే నలుగురు యువకులు చనిపోయిన విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఎమ్మెల్సీ కసిరెడ్డి పరామర్శ
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అలాగే తమ విద్యాసంస్థల తరపున సహాయ చర్యలు అందిస్తామని చెప్పారు. ఆయన వెంట సర్పంచులు జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, సర్పంచ్​ వెంకటమ్మ, ఎంపీటీసీ రేవతి రాజశేఖర్, పెద్ది రామకృష్ణ, చిట్టి కార్డు రాం నాయక్, సింగిల్ విండో వైస్ చైర్మన్ సంజీవ్ కుమార్ యాదవ్ ఉన్నారు. మాదిగ జిల్లా జేఏసీ నాయకులు పోలే రాజు, కాటిక రామస్వామి, జక్కుల శ్రీనివాస్ యాదవ్, హరికిషన్ నాయక్, దుబ్బ తండా శ్రీనివాస్ తదితర మండల ముఖ్య నాయకులు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.