- బీజాపూర్ జిల్లా తెర్రం అటవీప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్
- నేలకొరిగిన 22 మంది జవాన్లు మృతి
- పరామర్శించిన ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బాగెల్
- నేడు ఛత్తీస్ గఢ్‌కు హోంమంత్రి అమిత్ షా
సారథి, కరీంనగర్, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతం తుపాకుల కాల్పుల శబ్దాలతో దద్దరిల్లింది. మావోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో జవాన్లు విగతజీవులుగా చెల్లాచెదురుగా పడి ఉన్నారు. గాయపడినవారిని చికిత్స కోసం పలు ఆస్పత్రులకు తరలించారు. జవాన్ల మృతదేహాలను భద్రతా బలగాలు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలించాయి. గాయపడిన జవాన్లను రాయపూర్, బీజాపూర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు 22 మంది జవాన్లు కన్నుమూసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. మృతిచెందిన వారిలో ఏడుగురు కోబ్రా, 8 మంది డీఆర్‌జీ, ఆరుగురు ఎస్‌టీఎఫ్, ఒకరు బస్తర్ బెటాలియన్ జవాన్ ఉన్నారు.
అడవిలో ఏం జరిగింది
తెర్రం అటవీ ప్రాంతంలో వారం పదిరోజులుగా మావోయిస్టు మిలీషియా ప్లాటూన్ కమాండర్ హిడ్మా నేతృత్వంలో సాయుధ నక్సల్స్ దళాలు సమావేశమై సంచరిస్తున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తారాపూర్, ఊసూరు, పామేడు, మినపా, నరసాపూర్ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో కోబ్రా, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలు బయలుదేరి వెళ్తున్నాయి. అప్పటికే యూ ఆకారంలో అంబుష్ వేసి ఉన్న సుమారు ఆరొందల మంది మావోయిస్టులు భద్రతా బలగాలపై విరుచుకుపడి ముప్పేట దాడి చేశారు. ఈ వ్యూహాత్మక దాడిలో మావోయిస్టులు మోర్డార్ లాంచర్లు, గ్రైనేడ్లు వంటివి ఉపయోగిస్తూ కాల్పులు జరపడంతో ఆ ధాటికి జవాన్లు ఉక్కిరిబిక్కిరై చెల్లాచెదురైనట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశ్ నుంచి ఇన్‌శాస్ ఆయుధంతో పాటు ఒక మహిళా మావోయిస్టు డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పామేడు ఎల్‌జీఎస్ కమాండర్ మడివి వనజగా భావిస్తున్నారు.
నేలకొరిగిన జవాన్లు వీరే..
తెర్రం జోనగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు అసువులు బాశారు. వారిలో డీఆర్‌జీ జవాన్లు దీపక్ భరద్వాజ్, రమేష్ కుమార్, నారాయణ్ సోడి, రమేశ్ కొర్సా, సుభాష్ నాయక్, కిషోర్ ఎడ్రీక్, సంకురామ్ సోడి, భోలారామ్ కట్మామి ఉన్నారు. ఎస్‌టీఎఫ్ జవాన్లలో శ్రవణ్ కశ్యప్, రామ్రావ్ కోరం, జన్తారామ్ కవర్, సుభసింహ, రమాశంకర్, శంకరానాథ్ ఉన్నారు. కోబ్రా జవాన్లలో దిలీప్ కుమార్ దాస్, రాజ్‌కుమార్ యాదవ్, శంభురాయ్, ధర్మదేవ్ కుమార్, శాఖమూరి మురళీకృష్ణ, జగదీశ్, బబ్లూ రబ్బా ఉన్నారు. బస్తర్ బెటాలియన్ జవాన్ సమ్యా మడ్వి మృతిచెందారు. అయితే ఒక కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింహ ఆచూకీ లభించలేదని సీజీ పోలీసు అధికారులు వెల్లడించారు.
వీరోచితంగా పోరాడారు: ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బాగెల్
బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ జవాన్లను ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాగెల్ ఆదివారం రాత్రి పరామర్శించారు. రాయ్‌పూర్ లోని రామకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో జవాన్లు వీరోచితంగా పోరాడారని కొనియాడారు. రెండువేల మంది బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయని వివరించారు. ఐదు టీంల్లో ఒక టీం మావోయిస్టుల చేతికి చిక్కిందన్నారు. మావోయిస్టులు చేసిన దాడిని తిప్పికొట్టేందుకు జవాన్లు నాలుగు గంటల పాటు ధైర్యంగా పోరాటం చేశారన్నారు.
తెలంగాణ హోంమంత్రి దిగ్భ్రాంతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది భద్రతా సిబ్బంది అసువులు బాసిన సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా భద్రతా దళాలు దేశం కోసం, ప్రజాభద్రత, రక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ ఘటనలో మరి కొంతమంది సిబ్బంది ఆచూకీ తెలియకపోవడం మరింత ఆందోళన కలిగించే విషయమన్నారు.
ఛత్తీస్ గఢ్‌కు అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం 10.30 గంటలకు ఛత్తీస్ గఢ్లోని జగ్దల్ పూర్ చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ , పోలీసు అధికారుతలతో కలిసి బీజాపూర్ ఎన్ కౌంటర్ లో మరణించిన జవాన్లకు నివాళులర్పిస్తారు. అనంతరం మావోయిస్టుల ఏరివేతపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బసగూడా చేరుకుని బెటాలియన్ జవాన్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత రాయ్ పూర్ కు వెళ్లి క్షతగాత్రులైన జవాన్లను పరామర్శిస్తారు. అనంతరం మరోసారి ఉన్నతాధికారులతో సమావేశమై ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.